Massive Fraud: అధిక లాభాల పేరుతో సోదరుల ఘరానా మోసం.. 70వేల మంది నుంచి 2వేల 700 కోట్లు వసూలు..

ఫ్లాట్లు, పెట్టుబడి పథకాలతో ఆకర్షించారు. భారీ లాభాలు ఇస్తామని వాగ్దానం చేశారు.

Massive Fraud: అధిక లాభాల పేరుతో సోదరుల ఘరానా మోసం.. 70వేల మంది నుంచి 2వేల 700 కోట్లు వసూలు..

Updated On : June 15, 2025 / 9:41 PM IST

Massive Fraud: రాజస్తాన్ లో ఘరానా మోసం వెలుగుచూసింది. ఇద్దరు సోదరులు భారీ ఫ్రాడ్ కి పాల్పడ్డారు. ఏకంగా 70వేల మందిని చీట్ చేశారు. వారి నుంచి 2వేల 700 కోట్ల రూపాయలు వసూలు చేసి ఎస్కేప్ అయ్యారు. సుభాష్ బిజారాణి, రణ్ వీర్ బిజారాణి.. వీరిద్దరూ సోదరులు. సికార్ జిల్లాలో నివాసం ఉంటారు. నెక్సా ఎవర్ గ్రీన్ పేరుతో కంపెనీ స్థాపించారు. గుజరాత్‌లోని ‘ధోలేరా స్మార్ట్ సిటీ’లో అధిక రాబడి, స్థలాలను హామీ ఇచ్చి పెట్టుబడిదారులను మోసం చేశారు. ధోలేరా నగర ప్రాజెక్టుల చిత్రాలను చూపించి పెట్టుబడిదారులను చీట్ చేశారు.

అధిక లాభాలు, ప్లాట్ల పేరుతో ఇన్వెస్టర్లను మోసగించారు. గుజరాత్ లో డోలేరా స్మార్ట్ సిటీ ఉందని, అందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక లాభాలు పొందొచ్చని నమ్మించారు. ఈ పథకంలో చేర్చించిన వారికి కమీషన్లు, రివార్డులు కూడా ఇచ్చారు సుభాష్ సోదరులు. రివార్డుల ఆధారంగా ల్యాప్‌టాప్‌లు, బైక్‌లు, కార్లు కూడా ఇచ్చారు.

రణ్‌వీర్ బిజారాణి తొలిసారిగా 2014లో ధోలేరాలో భూమిని కొనుగోలు చేశాడు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి సుభాష్ కూడా పదవీ విరమణ తర్వాత పొందిన రూ. 30 లక్షలతో భూమిని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఇద్దరు సోదరులు నెక్సా ఎవర్‌గ్రీన్‌ను స్థాపించి 2021లో అహ్మదాబాద్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. కంపెనీ తనను తాను ‘ధోలేరా స్మార్ట్ సిటీ’ ప్రాజెక్టులో భాగమని చెప్పుకుంది. తమ దగ్గర 1,300 బిఘాలు (భారతదేశంలో భూమి కొలతకు ఒక సాంప్రదాయ యూనిట్) భూమి ఉందని, దీనిని ప్రపంచ స్థాయి నగరంగా మార్చబోతున్నామని చెప్పింది. అలా 70వేల మందికి పైగా ప్రజలను ఫ్లాట్లు, పెట్టుబడి పథకాలతో ఆకర్షించారు. భారీ లాభాలు ఇస్తామని వాగ్దానం చేశారు. వారు వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యింది. దేశవ్యాప్తంగా పెట్టుబడిదారుల నుండి దాదాపు రూ.2వేల 676 కోట్లు సేకరించారు.

Also Read: వావ్.. మధ్యప్రదేశ్‌లో మరో తాజ్ మహల్.. భార్య కోసం కట్టించిన భర్త.. చూస్తే అద్భుతం అనాల్సిందే..

పలువురు ఉన్నతాధికారులను కూడా వారు వాడుకున్నారు. వారి ద్వారా రాజస్థాన్‌లో వేలాది మంది ఏజెంట్లను నియమించుకున్నారు. వారికి భారీగా కమీషన్లు ఇచ్చారు. సుమారు 1500 కోట్లు కమీషన్ల రూపంలో ఇచ్చారు. మోసం చేయగా వచ్చిన డబ్బుతో వారు 1,300 బిఘాల భూమిని కొనుగోలు చేశారు. తర్వాత వారు రాజస్థాన్‌లో లగ్జరీ కార్లు, గనులు, హోటళ్ళు కొనుగోలు చేశారు. అహ్మదాబాద్‌లో ఫ్లాట్‌లు, గోవాలో 25 రిసార్ట్‌లను కొన్నారు. రూ.250 కోట్ల నగదు తీసుకొని మిగిలిన డబ్బును 27 షెల్ కంపెనీలకు బదిలీ చేశారు. ఆ తర్వాత తమ కార్యాలయాలన్నింటినీ మూసివేసి పారిపోయారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

భారీ మోసం కావడంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. నెక్సా ఎవర్‌గ్రీన్ మోసంలో మనీలాండరింగ్ దర్యాప్తుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు జైపూర్, సికార్, ఝుంఝును, అహ్మదాబాద్‌లోని 25 ప్రదేశాలలో సోదాలు నిర్వహించారు.

ధోలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కేంద్రం, గుజరాత్ మధ్య ఉమ్మడి ప్రాజెక్ట్. ఇది భారతదేశంలోని మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీ. ఢిల్లీ కంటే రెండు రెట్లు పెద్దది. అంతర్జాతీయ విమానాశ్రయం, బహుళజాతి కంపెనీల కార్యాలయాలు నిర్మిస్తున్నారు. దీనిని 2042 నాటికి అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు.