మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ నామినేషన్…జేడీయూ-బీజేపీలో భారీగా సస్పెన్షన్లు

బీహార్ మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ ప్రసాద్ యాదవ్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు తన తల్లి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. రాఘోపుర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
అంతకుముందు తేజస్వీ మీడియాతో మాట్లాడారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిని గెలిపిస్తే.. మొదటి కేబినెట్ భేటీలోనే 10లక్షల ఉద్యోగాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పనికి తగ్గ వేతనం హామీని నెరవేస్తామన్నారు. బిహార్ ప్రజలు, ఆర్జేడీ కార్యకర్తలు లాలూను మిస్ అవుతున్నారని ఈ సందర్భంగా రబ్రీదేవి వ్యాఖ్యానించారు.
మరోవైపు, బీహార్ ఎన్నికలు ముంచుకొస్తుండగా పాలక జేడీ-యూలో ముసలం మొదలవుతోంది. అసమ్మతి గళం విప్పుతున్నందుకు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు 15 మంది నేతలను ఈ పార్టీ ఆరేళ్ళ పాటు బహిష్కరించింది. బహిష్కరించిన జేడీ-యూ నాయకుల్లో ఒకప్పుడు ఈ పార్టీ అధినేత, సీఎం నితీష్ కుమార్ కి సన్నిహితులైనవారూ ఉన్నారు. బీజేపీ కూడా 9 మంది నాయకులపై ఇలాంటి చర్యే తీసుకుంది. ఎన్నికల్లో జేడీ-యూ, బీజేపీ కూటమి అప్పుడే ఇలాంటి ‘కష్టాలను’ ఎదుర్కొంటోంది.
ఇదిలా ఉండగా రాష్ట్ర శాసన సభ మొదటి దశ ఎన్నికల్లో మొత్తం 1065 అభ్యర్థులు రంగంలో మిగిలారని చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసు వర్గాలు తెలిపాయి. 25 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు పేర్కొన్నాయి. తొలి దశలో 71 స్థానాలకు పోలింగ్ జరగనుంది. కాగా, మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అక్టోబర్-28న తొలివిడత పోలింగ్, నవంబర్-3న రెండో విడత, నవంబర్-7న మూడో విడత పోలింగ్‌ను నిర్వహించి.. నవంబర్ 10న ఫలితాలను వెల్లడించనున్నట్లు సీఈసీ వెల్లడించారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 29తో ముగియనుంది.