పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు..కరోనా దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం

The winter session of Parliament adjourned : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దయ్యాయి. ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికల కారణంగా శీతాకాల సమావేశాలు రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఓ వైపు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో పాటు… కరోనా విజృంభిస్తుండడంతో.. అన్నీ పార్టీల నేతలతో కేంద్రం చర్చలు జరిపింది. ఆల్ పార్టీ మీటింగ్ సమావేశంలో కూడా సభ్యులు ఏకాభిప్రాయం వ్యక్తం చేయడంతో… సమావేశాలు రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
మరోవైపు జనవరి చివరి వారంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ వెల్లడించారు. అప్పటికి కరోనా ప్రభావం తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారని వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది.
అయితే కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి మాత్రం పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని పట్టుబడ్డారు. ఓ వైపు ఢిల్లీలో రైతులు దీక్షలు చేస్తున్న నేపథ్యంలో రైతు సమస్యలపై పార్లమెంట్ లో చర్చించాలన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతల ఉద్యమానికి భయపడి కేంద్రం సమావేశాలు నిర్వహించడం లేదని ఆరోపించారు.