Tiger Cubs: ఆకలితో చనిపోయిన పులి కూనలు
బండీపుర అభయారణ్యంలో సోమవారం గస్తీలోనున్న అటవీ సిబ్బందికి పొదల్లో సుమారు నెలన్నర వయసున్న మూడు పులి కూనలు..

Tiger Cubs
Tiger Cubs: మైసూరు జిల్లాలోని బండీపుర అరణ్యంలో తల్లి లేని మూడు పెద్ద పులి పిల్లల్లో రెండు మృత్యువాత పడిన విషాదం వెలుగుచూసింది. బండీపుర అభయారణ్యంలో సోమవారం గస్తీలోనున్న అటవీ సిబ్బందికి పొదల్లో సుమారు నెలన్నర వయసున్న మూడు పులి కూనలు కనిపించాయి.
వాటిలో ఒకటి చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. మరో రెండు తీవ్ర ఆకలితో మృత్యువుతో పోరాడుతున్నాయి. తల్లిపులి వాటిని వదిలేసి వెళ్లడంతో రోజుల తరబడి పాలు, పోషణ కరువై ఇలా జరిగి ఉండొచ్చని అధికారులు తెలిపారు. పులి కూనలను హుటాహుటిన మైసూరు జూకు తీసుకొస్తుండగా మరొకటి కూడా చనిపోయింది. బతికి ఉన్న ఏకైక కూనకు ఆహారం అందించి చికిత్స చేపట్టారు.
చనిపోయినవాటికి పోస్టుమార్టం నిర్వహించగా ఆహారం అందకపోవడమే మృతికి కారణమైనట్లు గుర్తించారు. అంతేకాకుండా తల్లి పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఐదేళ్ల క్రితం నాగరహోల్ రిజర్వ్ ఫారెస్ట్ లో రెండు పులులు చనిపోగా మరొకటి కనిపించకుండా పోయింది.