Uday Kotak: డబ్బులు ప్రింట్ చేయాల్సిన సమయం వచ్చింది – ఉదయ్ కొటక్

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంపై మహీంద్రా బ్యాంక్ అధినేత ఉదయ్ కొటక్ స్పందించారు. కొవిడ్-19 కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాలంటే నోట్ల ముద్రణ ఒక్కటే మార్గమని అన్నారు.

Uday Kotak: డబ్బులు ప్రింట్ చేయాల్సిన సమయం వచ్చింది – ఉదయ్ కొటక్

Uday Kotak

Updated On : May 27, 2021 / 9:27 PM IST

Uday Kotak: ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంపై మహీంద్రా బ్యాంక్ అధినేత ఉదయ్ కొటక్ స్పందించారు. కొవిడ్-19 కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాలంటే నోట్ల ముద్రణ ఒక్కటే మార్గమని అన్నారు. ఈ మేరకు కొన్ని సూచనలిచ్చిన ఆయన.. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ నోట్లు ప్రింట్ చేస్తారని ప్రశ్నించారు. ఆయన ప్రముఖ ఇంగ్లీష్ మీడియా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా మాట్లాడారు.

కరెన్సీ అచ్చువేయడం అనేది రెండు స్థాయిల్లో జరగాల్సిన అంశం. మొదటిది పేదరికం అనుభవిస్తున్న వారి కోసం, రెండోది మహమ్మారి వల్ల ఉపాధి కోల్పోయిన వారి కోసం. రిజర్వ్ బ్యాంక్ సపోర్టుతో నోట్లు ప్రింట్ చేయడం ద్వారా బ్యాలెన్స్ షీట్ విస్తరించుకునేందుకు సరైన సమయం అనుకుంటున్నా. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోకపోతే మరెప్పుడు తీసుకుంటాం’ అని ప్రశ్నించారు.

‘దారిద్ర్యరేఖలో ఉన్న వారికి వైద్యపరమైన ప్రయోజనాలు కల్పించాలి’ అని ఆయన చెప్పారు.

జనవరి నాటికి ప్రభుత్వం దశలవారీగా లాక్‌డౌన్ నియంత్రణలను ఎత్తేసింది. సెకండ్ వేవ్ ప్రమాదంతో కొవిడ్ కేసులు మళ్లీ పెరిగాయి. దాదాపు ప్రతి రాష్ట్రంలో కొత్తగా నియంత్రణలు పెట్టాల్సి వచ్చింది. అలా బిజినెస్‌లకు బ్రేకులు పడి ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. గతేడాది జరిగిన నష్టం నుంచి కోలుకునే లోపే ఇలా జరగడం మరింత దిగజార్చింది.

గతేడాది మార్చి నుంచి అమలవుతోన్న లాక్‌డౌన్‌ల వల్ల 10 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. 15 శాతం మందికి ఇయర్ ఎండింగ్‌లోనూ మల్లీ ఉపాధి దొరకలేదు. అలాంటి నిస్సహాయతలో ఉన్న వారిని ఏదో విధంగా ఆదుకోక తప్పదని కోటక్ తెలిపారు.

నష్టాల్లో ఉన్న కొన్ని రంగాలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం గతేడాది విజయవంతమైన రుణ ప్రణాళికను రూపొందించింది. దానిని ప్రస్తుత రూ.3 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లకు పెంచాలని కోటక్ సూచించారు.