Traffic Challan Rules : వాహనదారులకు హెచ్చరిక.. మీ బండి మీద చలాన్లు పెండింగ్ ఉన్నాయా?..
Traffic Challan Rules : కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సెంట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్-1989లో కీలక సవరణలను ప్రతిపాదిస్తూ ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.
Traffic Challan Rules
Traffic Challan Rules : ట్రాఫిక్ చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యం చేసే వాహనదారులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సెంట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్-1989లో కీలక సవరణలను ప్రతిపాదిస్తూ ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే, తుది నిర్ణయానికి వచ్చిన ట్రాఫిక్ చలాన్లను చెల్లించని వారికి డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)కు సంబంధించిన పలు కీలక సేవలు నిలిపివేయనున్నారు.
ముసాయిదా నిబంధనల ప్రకారం.. ట్రాఫిక్ చలాన్‌పై నిర్ణీత గడువులోపు అభ్యంతరం వ్యక్తం చేయకపోయినా లేదంటే విచారణ పూర్తై జరిమానా ఖరారైన తర్వాత కూడా చెల్లించకపోతే, సంబంధిత వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన దరఖాస్తులను అధికారులు ప్రాసెస్ చేయరు. చలాన్ చెల్లించిన తర్వాత మాత్రమే ఆ సేవలు తిరిగి అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా, సంబంధిత వాహనాన్ని ప్రభుత్వ పోర్టల్‌లో నాట్ టు బీ ట్రాన్సాక్టెడ్ (Not to be Transacted)గా గుర్తిస్తారు. ఈ విషయంపై వాహన యజమాని లేదంటే లైసెన్స్ హోల్డర్ ఫోన్‌కు అలర్ట్ మెస్సేజ్ వస్తుంది. అయితే చలాన్ కేసు కోర్టులో లేదంటే అడ్జుడికేటింగ్ అథారిటీ ఎదుట పెండింగ్‌లో ఉంటే ఈ ఆంక్షలు వర్తించవు. వాహన పన్ను చెల్లింపులకు మాత్రం ఎలాంటి అంతరాయం ఉండదు.
రాష్ట్రాల్లో ప్రత్యేక అడ్జుడికేషన్ వ్యవస్థ..
ట్రాఫిక్ చలాన్లపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రతి రాష్ట్రం కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన ఆరు నెలల్లో ప్రత్యేక అడ్జుడికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రతి జిల్లాకు అడ్జుడికేటింగ్ అథారిటీని నియమించి, వీడియో కాన్ఫరెన్స్‌తో పాటు ఆన్లైన్ విచారణలకు అవసరమైన సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. విచారణ పూర్తయిన తర్వాత 30 రోజుల లోపు తీర్పు ఇవ్వాలి. అప్పీల్ దాఖలైతే అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) స్థాయి లేదంటే సమాన హోదా కలిగిన అప్పీలేట్ అథారిటీ కూడా 30రోజుల్లోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఆలస్యం చేసే అధికారులపై జరిమానా..
ఈ ముసాయిదాలో అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. నిర్ణీత గడువులోపు తీర్పు ఇవ్వకపోయినా లేదంటే అప్పీల్ పరిష్కారంలో జాప్యం చేసినా సంబంధిత అధికారులకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు జరిమానా విధించే ప్రతిపాదనను కేంద్రం తీసుకొచ్చింది.
డిజిటల్ హెచ్చరికలకు చట్టబద్ధత..
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు ఇచ్చే హెచ్చరికలను కూడా ఇకపై అధికారిక డిజిటల్ రికార్డుల్లో నమోదు చేయనున్నారు. హెచ్చరికను అంగీకరించినా లేదంటే దానిపై చేసిన అభ్యంతరం తిరస్కరించబడినా అది తుది నిర్ణయంగా పరిగణిస్తారు. భవిష్యత్తులో అదే తరహా ఉల్లంఘన జరిగితే, ఈ హెచ్చరికలను గత ఉల్లంఘనలుగా పరిగణించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఆన్లైన్లోనే ఆర్సీ రద్దు..
ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన వాహనాలు, శాశ్వతంగా వినియోగానికి పనికిరాని వాహనాలు, గుర్తింపు పొందిన స్క్రాప్ కేంద్రాల్లో స్క్రాప్ చేసిన వాహనాలు లేదంటే శాశ్వతంగా విదేశాలకు తరలించిన వాహనాల రిజిస్ట్రేషన్‌ను కూడా ఆన్లైన్ ద్వారా రద్దు చేసే విధానాన్ని కేంద్రం ప్రతిపాదించింది. వాహన యజమాని సంఘటన జరిగిన 30 రోజుల్లోపు ఆన్లైన్ ద్వారా సమాచారం ఇవ్వాలి. అనంతరం రిజిస్ట్రేషన్ రద్దు చేస్తే యజమాని, బీమా సంస్థకు సమాచారం అందజేస్తారు. ఇందుకోసం ఫారం-37ఏ, ఫారం-37బీలను ప్రవేశపెట్టాలని ముసాయిదాలో పేర్కొన్నారు.
అయితే, ఈ ముసాయిదా నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం 30 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనుంది. వాటిని పరిశీలించిన అనంతరం తుది నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది.
