ట్రైన్ డ్రైవర్ కళ్లలో కారం పొడి : బాధ భరిస్తునే

ముంబై : పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో డ్రైవర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక ప్రమాదాలను నివారిస్తున్న ఘటనల గురించి వింటున్నాం. ఈ క్రమంలో ముంబయిలోని ఓ లోకల్ ట్రైన్ డ్రైవర్ అలాంటి సాహసాన్ని ప్రదర్శించి ప్రయాణీకులు ప్రాణాలను కాపాడాడు. అతడు చేసిన సాహసానికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసల్ని కూడా అందుకున్నాడు.ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ స్టేషన్ నుంచి టిట్వాలాకు లోకల్ ట్రైన్ బయలుదేరింది. కాల్వా స్టేషన్ దాటిన వెంటనే కొందరు ఆకతాయిలు డ్రైవర్ క్యాబిన్‌లోకి కారం పొడి విసిరారు. దీంతో డ్రైవర్ లక్ష్మణ్ సింగ్ కళ్లల్లో కారం పడింది. ఈ విషయాన్ని వెంటనే కంట్రోల్ రూమ్‌కు ఇన్ ఫామ్ చేశాడు.
వెంటనే మరో మరో డ్రైవర్ రావడం కుదరదని ముంబయి స్టేషన్ అధికారులు చెప్పడంతో కళ్లు మండిపోతున్న బాధతోనే 18 కిలోమీటర్లు రైలును నడిపి దివా స్టేషన్‌కు ట్రైన్ ని క్షేమంగా చేర్చాడు. డ్రైవర్ లక్ష్మణ్ సింగ్ చూపించిన ధైర్య సాహసాలకు మెచ్చిన సెంట్రల్ రైల్వే అధికారులు రూ. 1000 తో పాటు అతన్ని అభినందిస్తు ఓ సర్టిఫికెట్ కూడా అందజేశారు.
ఈ విషయంపై లక్ష్మణ్ సింగ్ మాట్లాడుతు..రైలు 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని చెప్పారు. ఆ పరిస్థితుల్లో రైలును మధ్యలోనే నిలిపేస్తే వెనుక వచ్చే రైళ్లకు అంతరాయం కలుగుతుంది. దీని ప్రభావం లక్షల మంది ప్రయాణికులపై పడుతుంది. అందుకే బాధను భరిస్తూనే రైలును నడిపాను’ అని చెప్పుకొచ్చాడు లక్ష్మణ్.