వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు షాక్ ఇచ్చిన కేంద్ర సర్కారు

అధికారం దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు షాక్ ఇచ్చిన కేంద్ర సర్కారు

Trainee IAS Officer Puja Khedkar Training Put On Hold

Trainee IAS Officer Puja Khedkar: అధికారం దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆమె శిక్షణను నిలిపివేసి, వెనక్కు పిలిచింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ (జీఏడీ) నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈనెల 23లోగా ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. తదుపరి అవసరమైన చర్య కోసం ఆమెను అకాడమీకి పిలిచినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

“మహారాష్ట్ర ప్రభుత్వ జిల్లా శిక్షణా కార్యక్రమం నుంచి మీరు రిలీవ్ అయ్యారు. జూలై 23లోపు వీలైనంత త్వరగా అకాడెమీలో చేరాల”ని పూజా ఖేద్కర్‌ను జీఏడీ ఆదేశించింది. ఆమెపై పలురకాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు చర్య తీసుకుంది. అధికారం దుర్వినియోగం చేశారని, దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగంలో చేరినట్టు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

2023 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన పూజా ఖేద్కర్.. ప్రొబేషన్‌లో భాగంగా పుణే జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా ఈ ఏడాది నియమితులయ్యారు. అయితే జూన్ 3న విధుల్లో చేరడానికి ముందే అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో వాషిమ్‌కు బదిలీ చేశారు. సివిల్ సర్వీసెస్‌లోకి రావడానికి యూపీఎస్సీకి నకిలీ డిజబిలిటీ సర్టిఫికెట్ సమర్పించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఓబీసీ సర్టిఫికెట్ తారుమారు చేసి ఎంబీబీఎస్ చదివినట్టు కూడా తాజాగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆమె తల్లి కూడా వివాదంతో చిక్కుకోవడంతో పూజ తీవ్ర విమర్శలపాలయ్యారు.

కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై మీడియా ట్రయల్ నడుస్తోందని పూజా ఖేద్కర్‌పై ఇంతకుముందు వ్యాఖ్యానించారు. తనను దోషిగా నిలబెట్టేందుకు మీడియా ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ఆరోపణలు రుజువయ్యే వరకు తాను నిరపరాధినేనని చెప్పుకొచ్చారు. అయితే నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఆమె కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read : నన్ను దోషిగా నిరూపించాలనుకోవడం తప్పు: మీడియాపై ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఫైర్