శశికళ స్వాగత వేడుకలో అపశృతి..చెన్నైలో చిన్నమ్మకు ఘన స్వాగతం

శశికళ స్వాగత వేడుకలో అపశృతి..చెన్నైలో చిన్నమ్మకు ఘన స్వాగతం

Updated On : February 8, 2021 / 4:25 PM IST

Sasikala’s convoy అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ స్వాగత వేడుకలో అపశ్రుతి జరిగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దాదాపు నాలుగేళ్లు బెంగళూరు జైల్లో శిక్ష అనుభవించి ఇటీవల విడుదలైన శశికళ ఇవాళ(ఫిబ్రవరి-8,2021) ఉదయం హోసూరు మీదుగా చెన్నైకి బయల్దేరిన నేపథ్యంలో తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని పోచంపల్లి వద్ద శశికళకు స్వాగతం పలికేందుకు బాణసంచా కాల్చడం వల్ల ఓ మద్దతుదారుడి కారులో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న మరో కారుకు మంటలు వ్యాపించి.. రెండు కార్లూ దగ్ధమయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్లే సమయంలో శశికళ హోసూర్ లోని మా ప్రత్యంగిర కాళిక ఆలయం​లో పూజలు చేశారు. మరోవైపు శశికళ ప్రయాణించిన కారుపై అన్నాడీఎంకే పార్టీ జెండా ఎగురుతూ ఉంది. పార్టీ సింబల్ రెండాకుల గుర్తు కోసం శశికళ,అన్నాడీఎంకే.. ఈ రెండు పక్షాలు పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో శశికళ కారుపై అన్నాడీఎంకే జెండాను గమనించిన పోలీసులు నోటీసులు జారీ చేశారు. కోర్టులో కేసు పెండింగ్​ ఉన్నందు వల్ల కేవలం నోటీసులు జారీ చేసి.. జెండాను తొలగించలేదు.

ఇక, మధ్యాహ్నాం చెన్నైలో అడుగుపెట్టిన శశికళకు చెన్నైలో అడుగడుగున ఘన స్వాగతం పలికారు ఏఎంఎంకే నేతలు,అభిమానులు. కర్ణాటక-తమిళనాడు సరిహద్దు నుంచి దారిపొడవునా బ్యానర్లు కట్టి శశికళను ఆహ్వానించారు అభిమానులు. రామవరం ఎస్టేట్ నుంచి ఎంజీఆర్ నివాసానికి వెళ్లనున్నారు శశికళ. ఎంజీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం చెన్నై హబీబుల్లా రోడ్‌లోని ఇంటికి వెళ్లనున్నారు. జయలలిత స్మారక మందిరం సందర్శించేందుకు అనుమతి లభించలేదు. దీంతో మంగళవారం.. స్మారక మందిరం సందర్శించాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో శశికళ మళ్లీ చెన్నైలో అడుగుపెట్టడం ఆ రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పుతాయని అంచనా వేస్తున్నారు. అధికార అన్నాడీఎంకేలో చీలక తప్పదని కొందరు భావిస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీలోని సగం మంది ఎమ్మెల్యేలు, నేతలు చిన్నమ్మ శశికళకు మద్దతిస్తున్నట్లు సమాచారం. పళనిస్వామి కేబినెట్‌లో, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కొందరు శశికళ అనుచరులున్నారు. శశికళ పొలిటికల్ రీఎంట్రీతో అన్నాడీఎంకేకు కొత్త తలనొప్పులు తప్పేలా లేవు.