ఎందుకో తెలుసుకోండి : రేపు, ఎల్లుండి (8,9) భారత్ బంద్

  • Published By: veegamteam ,Published On : January 7, 2019 / 12:44 PM IST
ఎందుకో తెలుసుకోండి : రేపు, ఎల్లుండి (8,9) భారత్ బంద్

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కార్మిక సంఘాలు కన్నెరజేశాయి. భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. 2019, జనవరి 8, 9వ తేదీల్లో బంద్ పాటిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ట్రేడ్ యూనియన్లు బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను చేపడుతోందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. పారిశ్రామికవేత్తలను అణిచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డాయి. 10 పెద్ద ట్రేడ్ యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ఆలిండియా కిసాన్ మహాసభ సైతం బంద్‌కు మద్దతిచ్చింది. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా భారత్ బంద్ చేపట్టనున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి.

భారత్ బంద్‌లో భాగంగా రైల్ రోకో, రోడ్ రోకో, నిరసన ప్రదర్శనలు, ఇతర ఆందోళనలు చేపట్టనున్నారు. రైతులు కూడా ఆందోళనల్లో పాల్గొననున్నారు. రుణమాఫీ, నెలకు రూ.3,500 నిరుద్యోగ భృతి చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ రంగ, చిన్న పరిశ్రమలు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు, నౌకాశ్రయాలలో పని చేసేవారు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల ఉద్యోగులు కూడా ఈ బంద్‌లో పాల్గొంటారు. ట్రేడ్ యూనియన్లు 12 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచాయి.