విచిత్రం : పాప పేరు కరోనా..బాబు పేరు లాక్ డౌన్

కరోనా మహమ్మారీ ప్రపంచాన్ని ఈ వైరస్ గడగడలాడిస్తోంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే..కొన్ని విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వైరస్ వ్యాపించకుండా ప్రాణాలకు తెగించి పని చేస్తున్న వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బంది కృషిని అభినందిస్తున్నారు. సహాయం చేసిన వారి పేర్లను తమ బిడ్డలకు పెట్టుకుంటున్నారు. తాజాగా యూపీలో వివిధ గ్రామాల్లో పుట్టిన శిశువులకు కరోనా..లాక్ డౌన్ పేర్లు పెట్టుకోవడం వైరల్ అయ్యింది.
వివరాల్లోకి వెళితే…
దొయిరా జిల్లాలోని కుకుండు గ్రామంలో ఓ మాతృమూర్తి..పండంటి బాబుకు జన్మనిచ్చింది. బాబుకు ఏ పేరు పెట్టాలని ఆలోచించసాగారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మెదిలాయి. దీంతో ‘లాక్ డౌన్’ పేరు పెట్టాలని నిశ్చయించుకున్నారు. ఈ సందర్భంగా బాబు తండ్రి పవన్ మాట్లాడుతూ..తమకు లాక్ డౌన్ కాలంలో బాబు జన్మించాడని చెప్పారు. ఈ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారని విషయాన్ని గుర్తు చేశారు. జాతి ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ..ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
ఇలాగే..మరో ఘటన చోటు చేసుకుంది. ఇదే రాష్ట్రంలోని (ఉత్తర్ ప్రదేశ్) ఘోరక్ పూర్ జిల్లాలో నివాసం ఉంటున్న మహిళ గర్భవతి. ఇటీవలే ఈమె జన్మనిచ్చింది. ఆ సమయంలో కరోనా విజృంభిస్తోంది. జనతా కర్ఫ్యూని విధించిన సమయంలో ఆమె డెలివరీ జరిగింది. పుట్టిన బిడ్డకు కరోనా పేరు పెట్టాలని నిశ్చయించుకున్నట్లు మేనమామ నితీష్ త్రిపాఠి వెల్లడించారు. కరోనా వైరస్ చాలా మందిని బలి తీసుకుందని అతను వెల్లడించారు. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే..ఈ కరోనా, లాక్ డౌన్ పేర్లను పెట్టడాన్ని పలువురు స్వాగతించారు.