గవర్నర్ చేతిలో మహా సీఎం భవిష్యత్తు…ఉద్దవ్ ఉద్యోగం ఊడుతుందా!

  • Published By: Mahesh ,Published On : April 29, 2020 / 09:27 AM IST
గవర్నర్ చేతిలో మహా సీఎం భవిష్యత్తు…ఉద్దవ్ ఉద్యోగం ఊడుతుందా!

Updated On : April 29, 2020 / 9:27 AM IST

మహారాష్ట్ర సీఎం పదవిని ఉద్దవ్ ఠాక్రే కోల్పోనున్నాడా?మహారాష్ట్ర కొత్త సీఎంగా ఆదిత్య ఠాక్రే ప్రమాణస్వీకారం చేయబోతున్నారా?మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తి ఎవరు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. దీనంతటి కారణం…సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇప్పటివరకు ఏ సభకూ(శానససభ,మండలి)ఎన్నిక కాకపోవడమే. గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దవ్ ఠాక్రే పోటీ చేయని విషయం తెలిసిందే. కొన్ని అనూహ్య పరిణామాలతో కాంగ్రెస్,ఎన్సీపీలతో చేతులు కలిపి గతేడాది నవంబర్ 28న ఆయన మహారాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టారు.

అయితే సీఎంగా ఉద్దవ్ కొనసాగాలంటే 6నెలల్లోగా ఆయన శాసనసభకు గానీ లేదా మండలికి గాని ఎన్నిక కావడం తప్పనిసరి. అయితే మే-28నాటికి ఉద్దవ్ సీఎం పగ్గాలు చేపట్టి 6నెలలు పూర్తి అవుతాయి. దీంతో మే-28లోగా ఆయన ఏదో ఒక సభకు ఎన్నికవ్వాలి. ఒకవేళ ఆయన అప్పట్లోగా ఏ సభకూ ఎన్నికకాకపోతే సీఎం పదవిని కోల్పోవాల్సి ఉంటుంది.

కాగా,ప్రస్తుతం కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎమ్మెల్సీ సహా అన్ని ఎన్నికలు వాయిదాపడ్డాయి. అయితే ఇద్దరు సభ్యులను శాసనమండలికి గవర్నర్ నామినేట్ చేయవచ్చు. దీంతో ఇప్పుడు ఉద్దవ్ కు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్…గవర్నర్ నామినేషన్ ద్వారా శాసనమండలికి ఎన్నికవ్వడమే. శాసనమండలికి ఉద్దవ్ ఠాక్రేను నామినేట్ చేయాలంటూ ఇప్పుడు మరోసారి మహావికాస్ అఘాడి ప్రభుత్వం గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారికి లేఖ రాసింది. ఏప్రిల్-11న మొదటిసారిగా గవర్నర్ కు ఈ మేరకు మహా ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పటివరకు ఉద్దవ్ ను మండలికి గవర్నర్ నామినేట్ చేయకపోవడం వెనుక రాజకీయం జరుగుతుదని,బీజేపీ కుట్రలు చేస్తుందని శివసేన నాయకులు ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర గవర్నర్.. బీజేపీ డైరక్షన్ లోనే పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు గవర్నర్ కార్యాలయం నుంచి ఎటుంవటి రెస్ఫాన్స్ లేదని,రాష్ట్ర కేబినెట్ రికమండేషన్ పై,ఉద్దవ్ ఠాక్రేను నామినేట్ చేయడంపై ఇప్పటివరకు గవర్నర్ ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదని శివసేన నాయకులు చెబుతున్నారు.

పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న సమయంలోరాష్ట్రాన్ని… రాజ్యాంగ సంక్షోభంలోకి గవర్నర్ నెట్టకూడదని శివసేన సీనియర్ నాయకులు తెలిపారు. ఇప్పుడు కనుక ఎన్నికలు జరిగి ఉండి ఉంటే ఉద్దవ్ ఠాక్రే ఈజీగా ఎన్నికయ్యేవాడని,అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆయన తలరాత ఇప్పుడు గవర్నర్ చేతిలో ఉందని ఎన్సీపీ,కాంగ్రేస్ నేతలు చెబుతున్నారు. కాగా భారతదేశంలో అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 8వేలు దాటగా,340కి పైగా మరణాలు నమోదయ్యాయి.