నేను అట్ల అనలే…హిందీ దుమారంపై స్పందించిన అమిత్ షా

  • Published By: venkaiahnaidu ,Published On : September 18, 2019 / 03:55 PM IST
నేను అట్ల అనలే…హిందీ దుమారంపై స్పందించిన అమిత్ షా

Updated On : September 18, 2019 / 3:55 PM IST

హిందీని జాతీయ భాషగా మార్చి ప్రాంతీయ భాషలను పక్కకు పెట్టాలని తాను ఎప్పుడు అనలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. మాతృభాషతో పాటు రెండో భాషగా హిందీని నేర్చుకోవాలని మాత్రమే సూచించానని షా అన్నారు. దేశంలో 40శాతానికి పైగా జనాభా మాట్లాడుతున్న హిందీని  జాతీయ భాషగా చేయాలంటూ హిందీ దివస్ రోజున అమిత్‌ షా వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతోన్న విషయం తెలిసిందే.

అమిత్‌ షా నిర్ణయాన్ని అన్ని దక్షిణాది రాష్ట్రాలు ముక్త కంఠంతో ఖండించాయి. ఆఖరికి బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో కూడా షా వ్యాఖ్యల పట్ల వ్యతిరేకత వ్యక్తమయ్యింది. కేంద్రం బలవంతంగా తమ మీద హిందీని రుద్దితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రజనీకాంత్,కమల్ హాసన్ వంటి పలువురు సెలబ్రిటీలు కూడా షా వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. తమపై బలవంతంగా హిందీ రుద్దాలని చూస్తే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని,మాతృభాష కోసం యుద్ధానికైనా సిద్దమన్నారు.

ఈ సమయంలో జాతీయ భాషగా హిందీ అంశంలో అమిత్‌ షా వెనక్కి తగ్గారు. తాను నాన్‌ హిందీ రాష్ట్రం గుజరాత్‌ కు చెందిన వాడినేనని, మాతృభాషతో పాటు రెండో భాషగా హిందీని నేర్చుకోవాలని మాత్రమే సూచించానని షా తెలిపారు. కానీ కొందరు నా వ్యాఖ్యలను వక్రీకరించి.. రాజకీయం చేయలని భావిస్తున్నారు. ఇక దీన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.