అందుకే కాంగ్రెస్ అధికారానికి దూరమైంది.. మనం ఆ తప్పులు చేయొద్దు: నితిన్ గడ్కరీ

కులం పేరుతో రాజకీయాలు చేయడం ట్రెండ్‌గా మారిందన్నారు. నేను కుల రాజకీయాలు చేయనని ప్రజలకు చెప్పాను.

అందుకే కాంగ్రెస్ అధికారానికి దూరమైంది.. మనం ఆ తప్పులు చేయొద్దు: నితిన్ గడ్కరీ

Union Minister Nitin Gadkari Comments in Goa BJP executive meeting

Nitin Gadkari: బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతం నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే ఓటమి తప్పదని హెచ్చరించారు. పనాజీ సమీపంలో జరిగిన గోవా బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం వల్లే అధికారానికి కాంగ్రెస్ పార్టీ దూరమైందని అభిప్రాయపడ్డారు. బీజేపీ భిన్నమైన పార్టీ అని, అందుకే ఓటర్ల నమ్మకాన్ని పదే పదే పొందుతోందని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక సంస్కరణలు తీసుకురావడానికి రాజకీయాలు సాధనంగా పనిచేస్తాయన్నారు. తాను కుల రాజకీయాలు చేయబోనని స్పష్టం చేశారు.

బీజేపీ భిన్నమైన పార్టీ
“కాంగ్రెస్ తప్పిదాల వల్లే ప్రజలు బీజేపీని ఎన్నుకున్నారు. మళ్లీ అలాంటి తప్పులే మనం చేయకూడదు. కాంగ్రెస్ చేసిన పనినే మనం కొనసాగిస్తే.. వారి నిష్క్రమణ, మన ఎంట్రీ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. బీజేపీ భిన్నమైన పార్టీ అని అద్వానీ జీ చెబుతుండేవారు. ఇతర పార్టీల కంటే మనం ఎంత భిన్నంగా ఉన్నామనేది అర్థం చేసుకోవాల”ని గడ్కరీ వ్యాఖ్యానించారు. దేశం నుంచి అవినీతిని తరిమికొట్టాలంటే పక్కా ప్రణాళిక అవసరమని అన్నారు. “మనం అవినీతి రహిత దేశాన్ని సృష్టించాలి. దాని కోసం మనకు నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి” అని గడ్కరీ ఉద్ఘాటించారు.

కుల రాజకీయాలు చేయను
తన సొంత రాష్ట్రం మహారాష్ట్రలో రాజకీయాలను ప్రస్తావిస్తూ.. కులం పేరుతో రాజకీయాలు చేయడం ట్రెండ్‌గా మారిందన్నారు. “నేను ఈ ధోరణిని అనుసరించకూడదని నిర్ణయించుకున్నాను. నేను కుల రాజకీయాలు చేయనని ప్రజలకు చెప్పాను. కులాల గురించి మాట్లాడే వారిని అధికారం నుంచి తరిమికొట్టాలి. కులాన్ని బట్టి కాకుండా మనం అనుసరిస్తున్న విలువలను బట్టే గుర్తింపు దక్కుతుంద’’ని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

Also Read : 13 నియోజకవర్గాల ఉపఎన్నిక ఫలితాల్లో ఇండియా కూటమి అభ్యర్థుల హవా

ఇటీవల జరిగిన లోక్‌స‌భ ఎన్నికల్లో బీజేపీకి అనుకున్న ఫలితాలు రాలేదు. గోవాలోని రెండు ఎంపీ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కోచోట విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో జరిగిన గోవా బీజేపీ కార్యవర్గ సమావేశంలో నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకువాలంటే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ కార్యకర్తలకు ఉద్భోదించారు. గోవా రాష్ట్ర శాఖ చీఫ్ సదానంద్ తనవాడే, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Also Read : అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన గౌతమ్ అదానీ.. వీడియో