Jhansi Hospital Incident: యూపీలోని చిన్నారుల మృతి ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు.. నర్సు నిర్లక్ష్యమే కారణమా?

ఘటన స్థలానికి చేరుకున్న ఉపముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ మాట్లాడుతూ.. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

Jhansi Hospital Incident: యూపీలోని చిన్నారుల మృతి ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు.. నర్సు నిర్లక్ష్యమే కారణమా?

Jhansi Hospital Incident

Updated On : November 16, 2024 / 1:11 PM IST

Jhansi Hospital Incident: యూపీలోని ఝాన్సీ జిల్లాలో మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కళాశాలలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకొని పది మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. మరో 16 మందికి గాయాలు కావటంతో వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో మొత్తం 52 మంది చిన్నారులు ఉన్నట్లు తెలిసింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగిన వెంటనే తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకొని బయటకు పరుగెత్తారు. ఆస్పత్రిలో ఉన్న గర్భిణులను వారి బంధువులు క్షేమంగా బయటకు తరలించారు. కానీ, పది మంది చిన్నారులు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Nara Ramamurthy Naidu: తమ్ముడి ఆరోగ్య పరిస్థితి విషమం.. చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు

ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని, పూర్తి దర్యాప్తు అనంతరం ఘటనకు కారణం ఏమిటి అనే విషయాలు తెలుస్తాయని చెప్పారు. అయితే, ఈ ఘటనకు కారణం ఓ నర్సు నిర్లక్ష్యమేనని భగవాన్ దాస్ అనే వ్యక్తి ఆరోపించాడు. హమీర్ పూర్ కు చెందిన భగవాన్ దాస్ కుమారుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందతున్నాడు. ఘటన జరిగిన సమయంలో భగవాన్ దాస్ అక్కడే ఉన్నాడు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు ఆక్సిజన్ సిలిండర్ పైప్ ను కనెక్ట్ చేస్తున్న సమయంలో దానిపక్కన మరో నర్సు అగ్గిపుల్ల వెలిగించిందని, అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని సదరు వ్యక్తి పేర్కొన్నాడు. ఆక్సిజన్ అధికంగా ఉన్న ప్రదేశ్ కావడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయని, వెంటనే నలుగురు పిల్లలను తన మెడకు బట్టలో చుట్టుకొని బయటకు పరుగెత్తానని, ఇతరుల సహాయంతో కొంత మంది పిల్లలను బయటకు తీసుకురావడం జరిగిందని పేర్కొన్నాడు. అయితే, ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అన్నికోణాలు దర్యాప్తు చేసిన తరువాతనే ఘటనకు కారణం ఏమై ఉంటుందనే విషయాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొంటున్నారు.

ఘటన స్థలానికి చేరుకున్న ఉపముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ మాట్లాడుతూ.. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మెజిస్టీరియల్ విచారణతో పాటు ఆరోగ్యశాఖ, పోలీసు, జిల్లా యంత్రాంగం ద్వారా మూడు స్థాయిలో విచారణలు జరుగుతాయని, పూర్తిస్థాయి నివేదికలు వచ్చిన తరువాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Also Read: Delhi Air Pollution : ఢిల్లీలో పెరిగిన గాలి కాలుష్యం… అన్ని స్కూళ్లు క్లోజ్.. ఇకపై ఆన్‌లైన్ క్లాసులు మాత్రమే!

ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 5లక్షలు, క్షతగాత్రులకు రూ. 50వేలు నష్టపరిహారం ప్రకటించారు. పది చిన్నారుల మృతి ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలో జరిగిన అగ్ని ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఇందులో తమ అమాయక పిల్లలను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అపార నష్టాన్ని భరించే శక్తి వారికి ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.