భార్యతో గొడవ పెట్టుకున్న వ్యక్తిని రోడ్డుపై ఉరికించి కొట్టి, ఇలా క్రూరంగా చంపేసి..

ఆ తర్వాత రోడ్డుపైనే సోను పడిపోయాడు. సోనును ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

భార్యతో గొడవ పెట్టుకున్న వ్యక్తిని రోడ్డుపై ఉరికించి కొట్టి, ఇలా క్రూరంగా చంపేసి..

Updated On : October 3, 2025 / 10:15 AM IST

Uttar Pradesh: భార్యతో గొడవ పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. దీంతో అత్తామామల కుటుంబ సభ్యులు అతడిని రోడ్డుపై ఉరికించి కొట్టి చంపేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

హాపూర్‌లో నివసించే సోను అనే వ్యక్తి భార్యతో గొడవపడ్డాడు. ఆ తరువాత ఆ మహిళ తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి బులంద్‌షహర్‌ నుంచి కుటుంబాన్ని పిలిచింది. తన భర్త తనను హింసిస్తున్నాడని చెప్పింది. (Uttar Pradesh)

దీంతో సోనుపై ఆ మహిళ కుటుంబం దాడి చేసింది. పారిపోవడానికి ప్రయత్నించిన సోనును హైవేలో వెంబడించారు. సోనును రక్షించడానికి ప్రయత్నించిన వారితో కూడా దురుసుగా ప్రవర్తించారు.

ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కొందరు వ్యక్తులు హైవేలో సోనును వెంబడిస్తూ పరిగెత్తడం కనిపించింది. వారిలో ఒకరు కర్ర పట్టుకుని ఉన్నారు.

ఆ తర్వాత రోడ్డుపైనే సోను పడిపోయాడు. సోనును ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. సోను విషపదార్థం కూడా తాగాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

సోను అత్తమామలు బలవంతంగా ఏదో తాగించారని సోను తల్లి సుఖ్విరి ఆరోపించింది. సోనుకి, అతడి భార్యకు తరుచూ గొడవలు అయ్యేవని చెప్పింది.

“నా కుమారుడు తన భార్యకు అడిగినవన్నీ ఇచ్చాడు. ఆమె కోసం ఒక భూమి కూడా అమ్మేశాడు. నా ఆభరణాలు కూడా ఆమె తీసుకెళ్లింది. వారు అతనికి ఏదో తాగించి చంపేశారు” అని సుఖ్విరి ఆరోపించారు.

సోను స్వయంగా విషం తాగాడా? లేక బలవంతంగా తాగించారా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. సోను కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా భార్య సహా అత్తమామల కుటుంబంలోని ఏడుగురిపై కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చౌహాన్ అన్నారు.