Yediyurappa Supporters : షాపులు మూసేసిన యడియూరప్ప అభిమానులు
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యడియూరప్ప సోమవారం రాజీనామా చేయడంతో ఆయన సొంతూరు ప్రజలు నిరాశ చెందారు.

Karnataka (1)
Yediyurappa Supporters కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీఎస్ యడియూరప్ప సోమవారం రాజీనామా చేయడంతో ఆయన సొంతూరు ప్రజలు నిరాశ చెందారు. శివమొగ్గ జిల్లాలోని షికారిపురలో యడియూరప్ప మద్దతుదారులు సోమవారం స్వచ్ఛందంగా అన్ని షాపులు,వాణిజ్య సముదాయాలు మూసి బంద్ పాటించారు. అనంతరం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ అధిష్ఠానం యడియూరప్పతో బలవంతంగా సీఎం పదవికి రాజీనామా చేయించిందని సొంతూరు షికారిపురలో ఆయన మద్దతుదారులు మండిపడ్డారు. యడియూరప్పకు అనుకూలంగా, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాగా,షికారిపుర పురసభ ప్రెసిడెంట్ గా యడియూరప్ప తన ఎన్నికల రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1983లో షికారిపుర అసెంబ్లీ స్థానం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 8 సార్లు అదే నియోజవకర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు కూడా ఆయన అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం వహిస్తున్నారు.
ఇక,యడియూరప్ప రాజీనామా నేపథ్యంలో కొత్త సీఎం ఎంపిక కోసం బీజేపీ అధిష్ఠానం కసరత్తు ఇప్పటికే ప్రారంభించింది. యడియూరప్ప రాజీనామా చేసిన కొద్ది నిమిషాల అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా..కర్ణాటక బీజేపీ ఇంచార్జి అరుణ్ సింగ్ తో పార్లమెంట్ లో సమావేశమయ్యారు. కర్ణాటకకి కొత్త సీఎం ఎంపిక కోసం కేంద్ర పరిశీలకులిని బీజేపీ నియమించనున్నట్లు సమాచారం. కొత్తగా ఎంపికయ్యే పరిశీలకులు కర్ణాటకలోని బీజేపీ నేతలతో సమావేశమై వారి అభిప్రాయాణాలను అడిగి తెలుసుకోనున్నారు. అయితే,బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి(ఆర్గనైజేషన్)గా బీఎల్ సంతోష్ లేదా ప్రస్తుతం కర్ణాటక హోంమంత్రిగా ఉన్న బసవరాజు బొమ్మైకి సీఎం పదవి దక్కవచ్చని సమాచారం.