భారత్‌పై 500 శాతం టారిఫ్.. మరో సంచలన బిల్లును ప్రవేశపెట్టే దిశగా ట్రంప్

అమెరికా ఈ బిల్లును ఆమోదిస్తే ఏం జరుగుతుంది?

భారత్‌పై 500 శాతం టారిఫ్.. మరో సంచలన బిల్లును ప్రవేశపెట్టే దిశగా ట్రంప్

Donald Trump and Modi

Updated On : July 2, 2025 / 9:02 AM IST

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించే దేశాలపై అమెరికా 500 శాతం టారిఫ్ విధించే అవకాశం ఉందని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహాం ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతుతో ఇందుకు సంబంధించి.. సెనేట్‌లో బిల్లు తీసుకురావడానికి తాము ప్రతిపాదన తీసుకొచ్చినట్లు వివరించారు.

‘‘రష్యా నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేస్తే, ఉక్రెయిన్‌కు సాయం చేయకపోతే, ఆయా దేశాల ఉత్పత్తులపై అమెరికాలో 500 శాతం టారిఫ్ ఉంటుంది. రష్యా చమురులో 70 శాతం భారత్, చైనా కొనుగోలు చేస్తాయి. పుతిన్ చేస్తున్న యుద్ధాన్ని ఇదే నడిపిస్తోంది’’ అన్నారు. ఈ బిల్లును ఆగస్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. రష్యాను ఆర్థికంగా ఒంటరిని చేసే అమెరికా ప్రయత్నాల్లో కీలక దశగా దీన్ని భావిస్తున్నారు.

చైనా, భారత్ లాంటి దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ రెండు దేశాలు రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తున్నాయి.

Also Read: నెగ్గిన ట్రంప్ పంతం.. సెనేట్‌లో ఒక్క ఓటు తేడాతో బిగ్ బ్యూటిఫుల్ బిల్‌కు ఆమోదముద్ర.. ఇక ఏం జరగనుంది?

భారత్‌పై తీవ్ర ప్రభావం!
అమెరికా ఈ బిల్లును ఆమోదిస్తే.. ఆ దేశానికి భారత్‌ ఎగుమతి చేసే వస్తువులు, సేవలపై అధిక పన్నుల భారం పడుతుంది. ముఖ్యంగా మన ఔషధాలు, వస్త్రాలు, ఐటీ సేవలపై టారిఫ్ ప్రభావం ఉంటుంది.

రష్యా చమురుకు భారత్ ప్రధాన కస్టమర్‌గా మారింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైన తర్వాత భారత్‌ భారీగా చమురును కొనుగోలు చేస్తోంది. గతంలో ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాల నుంచి భారత్ చమురు కొనుగోలు చేసేది.

భారత్, అమెరికా త్వరలోనే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయి. ఇంతలో అమెరికా 500 శాతం టారిఫ్ విధించే బిల్లును తీసుకురావాలనుకుంటుండడం గమనార్హం.

ఈ బిల్లు మార్చిలోనే ప్రతిపాదించారు. కానీ కొన్ని అభ్యంతరాలతో ఆలస్యమైంది. ఈ బిల్లు చట్టంగా మారితే అమెరికా.. భారత్, చైనా వాణిజ్య సంబంధాల్లో భారీ మార్పులు రావచ్చు.