ఓ మై గాడ్ : కాలుష్యం..దేవుడి విగ్రహాలకు మాస్క్!!

  • Published By: veegamteam ,Published On : November 6, 2019 / 06:28 AM IST
ఓ మై గాడ్ : కాలుష్యం..దేవుడి విగ్రహాలకు మాస్క్!!

Updated On : November 6, 2019 / 6:28 AM IST

మనకేమన్నా కష్టం వస్తే..దేవుడికి మొరపెట్టుకుంటాం. కానీ మనుషులకు వచ్చిన కష్టం దేవుడికి కూడా వస్తే..మరి ఇంకెవరికి చెప్పుకుంటాం. ఉత్తరభారతదేశ వాసులను బాధ పెట్టే వాయు కాలుష్యం అక్కడ పూజలందుకునే దేవుళ్లకు కూడా తప్పలేదు. ఏంటీ దేవుడికి కాలుష్యమా? అని ఆశ్చర్యపోతున్నారా? అదే మరి అసలు విశేషం.. 

సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ నియోజకవర్గమైన వారణాసిలో దేవుళ్లు వాయుకాలుష్యం బారిన పడ్డారు! దీంతో పూజారులు భగవంతుని విగ్రహాలకు మాస్క్‌లను పెట్టారు. దేవుడిని వాయు కాలుష్యం బారిన పడకుండా ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నామంటున్నారు.  

వారణాసిలోని సిగ్రా పరిధిలోని కాశీ విశ్వవిద్యాలయం సమీపంలోగల శివపార్వతీ మందిరంలోని దేవుళ్ల విగ్రహాలకు పూజారి..మాస్క్‌లను తొడిగారు. ఈ సందర్భంగా పూజారి హరీష్ మిశ్రా మాట్లాడుతూ వారణాసి ఎంతో  ఆధ్యాత్మికతకు నెలవుగా ఉన్న నగరం. ఇక్కడివారంతా భగవంతుడిని మానవుని రూపంలో చూస్తారు. వేసవిలో భగవంతుని విగ్రహాలను చల్లబరిచేందుకు చందనం రాస్తుంటాం. శరదృతువులో చల్లదనం పెరుగుతుంది. అందుకే భగవంతుని విగ్రహాలకు కంబళ్లు కప్పడంతో పాటు, స్వెట్టర్లను ధరింపజేస్తుంటాం. ఇప్పుడు భగవంతుని విగ్రహాలు కాలుష్యం బారినపడకుండా ఉండేందుకు మాస్క్ లను ధరింపజేస్తున్నామని తెలిపారు.

యూపీలోని వారణాసిలో  ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) మంగళవారం (నవంబర్ 5)న  400 నుండి 450 మధ్య ప్రమాదకరమైన స్థాయి కాలుష్యాన్ని సూచిస్తుంది. దీంతో భగవంతుడి విగ్రహాలు కాలుష్యం బారిన పడకుండా పూజారులు..భక్తులు మాస్కులు ధరింపజేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.