2 Crore Cash: అది ఇల్లా, బ్యాంకా? ఆ అధికారి ఇంట్లో నోట్ల కట్టల కలకలం.. ఏకంగా రూ.2కోట్లకు పైగా క్యాష్ గుర్తింపు..

అధికారుల రాకను గమనించిన చీఫ్ ఇంజినీర్.. నోట్ల కట్టలను కిటికీ నుంచి బయటకు పడేసేందుకు ప్రయత్నించాడు.

2 Crore Cash: అది ఇల్లా, బ్యాంకా? ఆ అధికారి ఇంట్లో నోట్ల కట్టల కలకలం.. ఏకంగా రూ.2కోట్లకు పైగా క్యాష్ గుర్తింపు..

Updated On : May 30, 2025 / 5:53 PM IST

2 Crore Cash: ఒడిశాలోని భువనేశ్వర్ లో అవినీతి అధికారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ అధికారి ఇంట్లో నోట్ల కట్టల కలకలం రేగింది. అతడి ఇంట్లో ఏకంగా 2కోట్ల రూపాయలకు పైగా క్యాష్ దొరికింది. దీంతో అధికారులే విస్తుపోయారు. రూరల్ వర్క్స్ డివిజన్ లో చీఫ్ ఇంజినీర్ గా పని చేస్తున్న వైకుంఠ నాథ్ సారంగి ఇంట్లో భారీగా నగదు దొరికింది.

చీఫ్ ఇంజినీర్ భారీగా అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. ఆయన ఇంట్లో సోదాలు జరిపారు. అధికారుల రాకను గమనించిన చీఫ్ ఇంజినీర్.. నోట్ల కట్టలను కిటికీ నుంచి బయటకు పడేసేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన అధికారులు నగదును సీజ్ చేశారు.

 

చీఫ్ ఇంజినీర్ సారంగిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆదాయానికి మించిన ఆస్తులు భారీగా కూడబెట్టినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. సారంగి ఇంటికి వెళ్లారు. అక్కడ నోట్ల కట్టలు చూసి వారు షాక్ కి గురయ్యారు. మనం వచ్చింది ఇంటికా, లేక బ్యాంకుకా అన్న సందేహం కలిగేలా.. వారికి అక్కడ నోట్ల కట్టలు కనిపించాయి.

ఆ నోట్ల కట్టలు లెక్కించేందుకు విజిలెన్స్ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. నోట్ల లెక్కింపు యంత్రాలను తెప్పించారు. చాలాసేపు కౌంటింగ్ చేశారు. చివరికి 2 కోట్ల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించారు.

Also Read: ట్రంప్‌ టారిఫ్‌ల అధికారాలకు ఓ కోర్టులో కత్తెర.. మరో కోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు.. అప్పీల్‌ విఫలమైతే ఏం జరిగేది?

కాగా, విజిలెన్స్ అధికారుల రాకను గమనించిన సారంగి భయపడ్డాడు. వారికి దొరక్కుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. 500 రూపాయల నోట్ల కట్టలను ఇంటి ప్లాట్ కిటికీ నుంచి బయటకు విసిరేశారు. ఇది గమనించిన అధికారులు ఆ నగదును సీజ్ చేశారు. 8 మంది డీఎస్పీలు, 12మంది ఇన్ స్పెక్టర్లు, ఆరుగురు ఏఎస్ఐలు, ఇతర సహాయక సిబ్బంది.. చీఫ్ ఇంజినీర్ సారంగి ఇళ్లలో ఏకకాలంలో సోదాలు జరిపారు. మొత్తం ఏడు ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో నగదును గుర్తించారు.

పనులు చేసేందుకు చీఫ్ ఇంజినీర్ భారీగా లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక అధికారి ఇంట్లో ఏకంగా 2 కోట్ల రూపాయల డబ్బు దొరకడం సంచలనంగా మారింది. అంటే.. ఆ అధికారి ఏ రేంజ్ లో అవినీతికి పాల్పడి ఉంటాడోనని షాక్ అవుతున్నారు. సారంగిపై కేసు నమోదు చేసిన అధికారులు లోతుగా దర్యాఫ్తు జరుపుతున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఆయన ఆస్తులు ఉన్నాయో వివరాలు తెలుసుకుంటున్నారు.