ట్రంప్‌ టారిఫ్‌ల అధికారాలకు ఓ కోర్టులో కత్తెర.. మరో కోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు.. అప్పీల్‌ విఫలమైతే ఏం జరిగేది?

అమెరికాలోని అంతర్జాతీయ వాణిజ్య కోర్టు ఇచ్చిన తీర్పును పై కోర్టులు సమర్థిస్తే పరిస్థితులు వేరుగా ఉండేవి.

ట్రంప్‌ టారిఫ్‌ల అధికారాలకు ఓ కోర్టులో కత్తెర.. మరో కోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు.. అప్పీల్‌ విఫలమైతే ఏం జరిగేది?

Updated On : May 30, 2025 / 1:03 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై భారీగా టారిఫ్‌లు విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో ఆ దేశ అధ్యక్షుడికి ఉన్న అధికారాలకు అమెరికాలోని అంతర్జాతీయ వాణిజ్య కోర్టు కత్తెర వేస్తూ.. డొనాల్డ్ ట్రంప్‌ తన అధికార పరిధిని అతిక్రమించారని స్పష్టం చేసింది.

ట్రంప్ అమెరికా వాణిజ్య విధానాన్ని తన ఆలోచనలకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్నారంటూ వచ్చిన పిటిషన్లపై విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లను కోర్టు అడ్డుకోవడంతో ఆయనకు మొదట ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. చైనా, మెక్సికో, కెనడాలపై ట్రంప్‌ సర్కారు విధించిన ప్రత్యేక సుంకాలను కూడా కోర్టు నిలిపివేసింది.

కోర్టు నుంచి ఈ తీర్పు వచ్చిన వెంటనే ట్రంప్ గవర్నమెంట్‌ పై కోర్టులో అప్పీల్‌ దాఖలు చేసింది. దీంతో గవర్నమెంట్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న పై కోర్టు.. కింది కోర్టు ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు చెప్పింది. అయితే, దీనిపై వచ్చేనెల 5లోగా పిటిషన్లు, 9లోగా పరిపాలనాధికారులు స్పందించాలని పేర్కొంది.

Also Read: ఏపీ డీఎస్సీ 2025 హాల్‌టికెట్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లపై అమెరికాలోని అంతర్జాతీయ వాణిజ్య కోర్టు కత్తెర వేయడంపై వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ కుష్ దేశాయ్ స్పందిస్తూ.. జాతీయ ఎమర్జెన్సీని ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని జడ్జిలు నిర్ణయించలేరని అన్నారు. అమెరికాను అన్నింట్లోనూ అగ్రస్థానంలో నిలబెడతామని ట్రంప్ ఇచ్చిన హామీ మేరకు అధికారాలను ఉపయోగించి ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరిస్తున్నారని చెప్పారు.

మొదట అమెరికాలోని అంతర్జాతీయ వాణిజ్య కోర్టు ఇచ్చిన తీర్పు అలాగే అమలైతే పరిణామాలు మరోలా ఉండేవి. ఒకవేళ పై కోర్టులో ట్రంప్ సర్కారు చేసిన అప్పీల్‌ విఫలమైతే యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తమ అధికారులకు ఆ ఆదేశాలు పాటించాలని చెప్పేది. అయితే, పై కోర్టులో ట్రంప్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.

అమెరికాలోని అంతర్జాతీయ వాణిజ్య కోర్టు ఇచ్చిన తీర్పును పై కోర్టులు సమర్థిస్తే పరిస్థితులు వేరుగా ఉండేవి. ఆయా సుంకాల పరిధిలోని వ్యాపారులు తాము ఇప్పటి వరకు చెల్లించిన మొత్తాలపై వడ్డీతో పాటు రీఫండ్స్ పొందే అవకాశం వచ్చేది. టారిఫ్‌లలో ప్రస్తుతం ఎటువంటి మార్పులూ ఉండవు. ఒకకోర్టు వాణిజ్య కోర్టు తీర్పు అమలైనప్పటికీ స్టీల్, అల్యూమినియం టారిఫ్‌లు ప్రభావితం కాకపోయేవి. ట్రంప్‌ తీసుకున్న అత్యవసర చర్యలకు భిన్నమైన చట్టం కిందకు స్టీల్, అల్యూమినియం టారిఫ్‌లు వస్తాయి.