పొత్తు పొడిచింది: బీజేపీతోనే విజయ్‌కాంత్

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాట రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పొత్తులు ఎత్తుల విషయంలో తర్జన భర్జనల అనంతరం తమిళనాట రెండు ముఖ్యపార్టీలు అయిన డీఎంకే, ఏఐడీఎంకేలు కీలక పొత్తులు కుదుర్చుకున్నాయి. ఇప్పటికే అధికార అన్నాడీఎంకే పార్టీ ఈమేరకు బీజేపీతో కూటమి కట్టగా.. నటుడు కెప్టెన్ విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకే కూటమితో చేతులు కలిపింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం కంచీపురంలో భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించనుండగా ఈ సభలోనే అన్నాడీంఎకే-బీజేపీ కూటమిలో డీఎండీకే చేరనున్నట్లు తెలుస్తుంది. పొత్తుల పరంగా తమిళనాడు రాజకీయాల్లో ఇది కీలక పరిణామంగా భావించవచ్చు. తమ కూటమిలో డీఎండీకే చేరుతుండగాన్ని తమిళనాడు సీఎం పళనిస్వామి కూడా దృవీకరించారు. రాబోయే ఎన్నికల్లో మొత్తం నాలుగు పార్టీలు (అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే, డీఎండీకే) కూటమిగా పోటీ చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.
విజయ్‌కాంత్ సతీమణి, డీఎండీకే కోశాధికారి ప్రేమలతతోపాటు పలువురు నేతలు సీఎం నివాసంలో పళనిస్వామిని కలవగా.. ప్రధాని మోదీ సభా ప్రాంగణంలో వేదికపై ఏర్పాటు చేసిన పోస్టర్‌లో ప్రధాని మోదీ, సీఎం పళనిస్వామితోపాటు విజయ్‌కాంత్ ఫోటోను కూడా ఉంచడం జరిగింది. కూటమిలో కొత్తగా చేరిన డీఎండీకేకు నాలుగు నుంచి 5 లోక్‌సభ స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తమిళనాడులోని 39స్థానాల్లో బీజేపీకి ఐదు, పీఎంకేకు 7స్థానాలను అన్నాడీఎంకే ఇప్పటికే ఖరారు చేసింది.