Bengal Panchayat Polls: రక్తసిక్తమైన పశ్చిమ బెంగాల్.. పంచాయతీ ఎన్నికల ఘర్షణల్లో పెరిగిన మృతుల సంఖ్య
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన ఘర్షణల్లో 18 మంది మరణించారు. పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు, తుపాకుల కాల్పుల మోతతో దద్దరిల్లాయి.

Bengal Poll violence
Bengal Poll violence : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. తుపాకీ పేలుళ్లు, బాంబుల మోతలు, పేలుడు పదార్థాల విస్ఫోటనాలతో శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాలు దద్దరిల్లి పోయాయి. ఈ హింసాత్మక ఘటనల్లో 18మంది మరణించారు. వీరిలో పది మంది టీఎంసీ కార్యకర్తలతో పాటు బీజేపీ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, ఐఎస్ఎఫ్ పార్టీలకు చెందిన వారు ఉన్నారు. పలుచోట్ల పోలింగ్ బూత్‌లను ఆందోళన కారులు ధ్వంసం చేశారు. అయితే, హింసాకండ మధ్య బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో సాయంత్రం 5గంటల వరకు 66.28శాతం ఓటింగ్ జరిగింది.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో శనివారం మొత్తం 18 మంది మరణించారు. వీరిలో అధికార పార్టీ టీఎంసీకి చెందిన 10మంది కార్యకర్తలు ఉన్నారు. బీజేపీ ముగ్గురు, కాంగ్రెస్ ముగ్గురు కార్యకర్తలు, సీపీఐ(ఎం)కు చెందిన ఇద్దరు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. ముర్షిదాబాద్, కూచ్ బెహార్, తూర్పు బుద్వాన్, మాల్దా ప్రాంతాల్లో ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కూచ్ బీహార్ జిల్లా దిన్హాటాలో దుండగులు బ్యాలెట్ బ్యాకులను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. ఓ యువకుడు ఏకంగా పోలింగ్ కేంద్రం నుంచి బ్యాలెట్ బాక్సును ఎత్తుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ హింసాత్మక ఘటనలపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో గవర్నర్ ఆనంద బోస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల వేళ ఇలాంటి ఘటనలు చాలా ఆందోళన కలిగించాయి. ఈ ఘటనల్లో కేవలం పేదలు మాత్రమే బలవుతున్నారు. హంతకులు కూడా పేదవారే. మనం పేదరికాన్ని అంతం చేయాలి. బదులుగా మనం పేదలను చంపుతున్నాము అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు బీజేపీ డిమాండ్ చేసింది. మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో స్వేచ్ఛాయుతంగా, న్యాయబద్దంగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితిలేదని బీజేపీ నేత సువేందు అధికారి విమర్శించారు.
Plane Crash : కాలిఫోర్నియాలో కూలిన విమానం..ఆరుగురి మృతి
హింసాత్మక ఘటనలపై పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. పోలీసుల నిర్వాకంతో అధికార పార్టీ పోకడలతో మునుపెన్నడూ లేని విధంగా భయాందోళనలు చోటు చేసుకున్నాయని అన్నారు. మా కార్యకర్తలు వందలాది మంది గాయపడ్డారు. ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. వాస్తవంగా ఎన్నికల దోపిడీకి ఇది ఒక ఉదాహరణ అని అన్నారు. తాజా ఘటనలపై టీఎంసీ ఒక వీడియో ట్వీట్ చేసింది. కూచ్ బెహార్‌లోని హల్దీబారీ బ్లాక్ లోని దేవాంగంజ్ గ్రామ పంచాయతీలో బెంగాల్ బీజేపీ మద్దతుదారులు బూత్‌ను స్వాధీనం చేసుకొని బ్యాలెట్ బాక్సులను విసిరారని ఈ వీడియోలో పేర్కొంది. మరోసారి బీజేపీ ప్రజల హక్కులపై దాడి చేసిందని టీఎంసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 63,229 పంచాయతీ స్థానాలకు, 9,730 పంచాయతీ సమితిలకు, 928 జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నిల్లో 2.06లక్షల మంది పోటీ పడ్డారు. మొత్తం 5.67 కోట్ల ఓటర్లు ఉండగా.. శనివారం సాయంత్రం 5గంటల వరకు 66.28శాతం పోలింగ్ నమోదైంది. జూలై 11న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇదిలాఉంటే.. పంచాయతీ ఎన్నికల వేళ హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఫిర్యాదులు, రీ పోలింగ్ కోసం డిమాండ్ లను పరిశీలిస్తామని ఎస్ఈసీ చెప్పింది.