కోర్టులో రూ.10కోట్ల జరిమానా చెల్లించిన శశికళ…జనవరిలో విడుదల

  • Published By: venkaiahnaidu ,Published On : November 18, 2020 / 06:16 PM IST
కోర్టులో రూ.10కోట్ల జరిమానా చెల్లించిన శశికళ…జనవరిలో విడుదల

Updated On : November 18, 2020 / 6:34 PM IST

Sasikala Deposits 10 Crore Fine In Court అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు విధించిన రూ.10 కోట్ల జరిమానాను తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి,ఏఐఏడీఎంకే మాజీ జనరల్ సెక్రటరీ శశికళ చెల్లించారు. శశికళ తరఫున ఆమె న్యాయవాదులు బెంగళూరు సెషన్స్ కోర్టులో 10కోట్ల 10వేల రూపాయలను చెల్లించారు. డిమాండ్ డ్రాఫ్టుల ద్వారా డబ్బులను అందజేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ మొత్తాన్ని ఓ రాజకీయ నాయకుడు ఏర్పాటు చేసినట్లు సమాచారం.



కాగా, 2017 ఫిబ్రవరిలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను దోషిగా తేలుస్తూ సుప్రీం కోర్టు శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శశికళ బెంగుళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో ఆమె శిక్ష అనుభవిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 వరకూ ఆమె జైలుశిక్ష అనుభవించాల్సి ఉన్నప్పటికీ సత్ప్రవర్తన తదితర కారణాల వల్లే జనవరి 27న ఆమెను విడుదల చేసే అవకాశం ఉందని కర్నాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ శశికళ విడుదలతో ఆ రాష్ట్రంలో కొత్త రాజకీయ పరిణామాలు చోటుచేసుకొనే అవకాశం ఉంది.



మరోవైపు, తాను జైలు నుంచి ఎప్పుడు విడుదలవుతాననే వివరాలను బయటకు వెల్లడించొద్దని బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు అధికారులకు శశికళ సెప్టెంబర్ లో ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. శశికల విడుదలకు సంబంధించి బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు దాఖలు చేయడంతో…న్యాయస్థానం విధించిన రూ.10 కోట్ల జరిమానా కడితే జనవరి 27న శశికళ విడుదలయ్యే అవకాశం ఉందని.. లేకపోతే మాత్రం 2022 ఫిబ్రవరి 27 వరకు జైలులోనే ఉండక తప్పదని జైలు అధికారులు తమ స్పందన తెలిపిన నేపథ్యంలో శశికళ జైలు చీఫ్‌ సూపరింటిండెంట్‌కు లేఖ రాశారు.



సమాచార హక్కు చట్టం కింద కూడా తన జైలు శిక్ష, విడుదల తదితర అంశాలను వెల్లడించొద్దని శశికళ కోరారు. వ్యక్తిగత గోప్యత హక్కు కూడా ప్రాథమిక హక్కేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఉటంకించారు. తన వివరాలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించడం కూడా వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమే అవుతుందని శశికళ తెలిపారు. కొందరు వ్యక్తులు ప్రచారం కోసమో, రాజకీయ దుష్ప్రచారం కోసమో ఇలాంటి దరఖాస్తులు చేస్తారని తెలిపారు.