హిందువులపై యుద్ధం…కేరళ టూరిజం బీఫ్ ట్వీట్ పై నెటిజన్లు ఫైర్

  • Published By: venkaiahnaidu ,Published On : January 17, 2020 / 03:47 AM IST
హిందువులపై యుద్ధం…కేరళ టూరిజం బీఫ్ ట్వీట్ పై నెటిజన్లు ఫైర్

మకర సంక్రాంతి రోజు బీఫ్ వంటకం గురించి కేరళ టూరిజం ట్విట్టర్ లో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. బుధవారం బీఫ్ ఫ్రై (బీఫ్ ఉలార్తియతు) ఫొటోను ట్వీట్ చేసిన కేరళ టూరిజం.. దాని రెసిపి లింక్‌ను కూడా షేర్ చేసింది. దీనిపై హిందూ సమాజం నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందువులపై జరుగుతున్న యుధ్ధం ఇదని కర్ణాటక బీజేపీ నాయకురాలు శోభా కరంద్లాజే అన్నారు.

ఈ ట్వీట్ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికా? బీఫ్‌ను ప్రమోట్ చేయడానికా? ఇది గోమాతను పూజించే కోట్లాది మంది మనోభావాలను ఇది దెబ్బతీయదా? శంకరాచార్యుడు జన్మించిన పుణ్య భూమి నుంచి ఇలాంటి ట్వీట్ వచ్చిందా? అని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ అన్నారు. గోవులను పూజించే తరుణంలో ఇలాంటి ట్వీట్ చేయడం కేరళ టూరిజం అభిరుచిని తెలియజేస్తోందని కొందరు మండిపడ్డారు. బీఫ్ ఫొటోతో చేసిన ట్వీట్లు తమ మనోభావాలను దెబ్బతీశాయని చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర రాష్ట్రాల ప్రజలు మకర సంక్రాంతి, భోగీ, బిహూ లాంటి పండుగలు జరుపుకొంటున్న రోజున బీఫ్ వంటకం గురించి ట్వీట్ చేయడం సరికాదని కొందరు అభిప్రాయపడ్డారు. ఆవులు, పశువులను పూజించే సంక్రాంతి రోజున ఇలాంటి ట్వీట్ చేయడం ఏంటి..? ఓవైపు తెలుగు రాష్ట్రాల్లో గంగిరెద్దుల మేళం జరుగుతుంటే.. తమిళనాడులో జల్లికట్టు, కర్ణాటకలో కంబాలా పోటీలు జరుగుతుంటే మీరు ఇది చూపిస్తారా?’ అని ఓ తెలుగు వ్యక్తి ఘాటుగా సమాధానం ఇచ్చారు. 

మరి కొందరైతే.. దమ్ముంటే పోర్క్ వంటకాల ఫొటోను ట్వీట్ చేయాలని కేరళ టూరిజానికి సవాల్ విసిరారు. మరి కొందరు నెటిజన్లు, ముఖ్యంగా కేరళకు చెందిన వారు మాత్రం.. టూరిజం శాఖ చేసిన ట్వీటును సమర్థిస్తున్నారు. కేరళలో హిందువులు కూడా బీఫ్, ఫోర్క్ సహా తమకు నచ్చింది తింటారని,ఎదుటి వాళ్లకు నచ్చింది తిననిస్తారంటున్నారు. కేరళ హిందువుగా గర్విస్తున్నానని ఒకరు ట్వీట్ చేశారు. బీఫ్ ట్వీట్ పట్ల విమర్శలు వెల్లువెత్తడంతో..తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయం లక్ష దీపాల వెలుగులో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఫొటోలను కేరళ టూరిజం ట్వీట్ చేసింది.