Weather Update: 85 ఏళ్లలో సెప్టెంబరులో ఎన్నడూ లేనంత గరిష్ఠ ఉష్ణోగ్రత
ఓ వైపు దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతుంటే, మరోవైపు ఢిల్లీలో సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడం..

Weather Update
Weather Update – Delhi: వానాకాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ(Delhi)లోని సఫ్దర్‌జంగ్‌లో సోమవారం ఏకంగా 40.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 85 ఏళ్లలో సెప్టెంబరులో ఇంత గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. 1938 సెప్టెంబరు 16న 40.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఓ వైపు దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతుంటే, మరోవైపు ఢిల్లీలో సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడం గమనార్హం. బలహీన రుతుపవనాల పరిస్థితులు ఉండడం, వర్షపాతం తక్కువగా నమోదు అవుతుండడం వల్లే ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఢిల్లీలో ఆగస్టులో 61 శాతం లోటు వర్షపాతం నమోదైంది. సాధారణంగా గతంలో ఆగస్టులో అత్యంత వర్షపాతం ఉండేది. సెప్టెంబరు నెల 4 వరకు 32.4 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంది. ఆ తర్వాత వర్షాలు పడలేదు. ఈ వారం ఉష్ణోగ్రత గరిష్ఠంగా 37, కనిష్ఠంగా 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.