వా తంబీ : చెన్నైలో మోడీ,జిన్ పింగ్ ఫ్లెక్సీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

  • Published By: venkaiahnaidu ,Published On : October 3, 2019 / 07:51 AM IST
వా తంబీ : చెన్నైలో మోడీ,జిన్ పింగ్ ఫ్లెక్సీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Updated On : October 3, 2019 / 7:51 AM IST

అక్టోబర్ 11,12న ప్రధానమంత్రి నరేంద్రమోడీ,చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చెన్నైలో సమావేశంకానున్నారు. ద్వైపాక్షిక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు. అయితే ఈ సందర్భంగా ఇద్దరు దేశాధినేతలకు స్వాగతం చెబుతూ చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి మమల్లాపురమ్ వరకు ప్రభుత్వం బ్యానర్లు ఏర్పాటు చేసేందుకు తమిళనాడు హైకోర్టు అనుమతిచ్చింది. దాదాపు 60కిలోమీటర్లవరకు ఫ్లైక్సీలు ఏర్పాటు చేసేందుకు జస్టిస్ సత్యనారాయణ్,జస్టిస్ శేషసాయిలతో కూడా ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజకీయ పార్టీలు హోర్డింగ్‌లు పెట్టకుండా మాత్రమే నిరోధించబడిందని,ప్రభుత్వం కాదని,పర్మీషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం తెలిపింది.

బ్యానర్ల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం తరపున కమీషనర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోర్టులో పిటిషన్ వేశాడు. గత నెలలో అక్రమ హోర్డింగ్ పైన పడి 23 ఏళ్ల యువతి మరణించిన తరువాత హోర్డింగ్ సంస్కృతిపై కోర్టు సీరియస్ గా స్పందించింది. అప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బ్యానర్‌లకు అధికారులు అనుమతి ఇవ్వడం లేదని ఆ పిటిషన్ లో తెలిపారు. అయితే విదేశాంగ మంత్రిత్వ శాఖ తరఫున రాష్ట్రాన్ని సందర్శించే ప్రముఖులని బ్యానర్‌ల ద్వారా స్వాగతించడం ఆచారం అని పిటిషన్‌లో వాదించారు.

మద్రాస్ హైకోర్టు గతంలో రోడ్డు పక్కన హోర్డింగ్ లు పెట్టడాన్ని నిషేధించింది. ఇటీవల మహిళా టెక్కీ మరణంతో ప్రభుత్వం తమ ఉత్తర్వులను సమర్థవంతంగా అమలు చేయలేదని ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసిన విషయం తెలిసిందే.