పశ్చిమ బెంగాల్‌లో బోటు బోల్తా : గల్లంతైన వారి కోసం గాలింపు

  • Published By: madhu ,Published On : September 30, 2019 / 01:11 PM IST
పశ్చిమ బెంగాల్‌లో బోటు బోల్తా : గల్లంతైన వారి కోసం గాలింపు

Updated On : September 30, 2019 / 1:11 PM IST

మరో బోటు ప్రమాదం జరిగింది. కానీ ఏపీలో కాదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో రూప్ నారాయణ్ నదిలో ఓ బోటు 50 మందితో వెళుతోంది. ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది. వరద ప్రవాహం పెరగడంతో బోటు ప్రమాదానికి గురైందని స్థానికులు వెల్లడిస్తున్నారు. సమాచారం అందుకున్న మహీష్ టోల్, తంబ్లుక్ పోలీస్ స్టేషన్‌లకు చెందిన సిబ్బంది గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. 22 నుంచి 24 మందిని రక్షించి శ్యాంపూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. 

పడవ ప్రమాద ఘటనపై బెంగాల్ ట్రాన్స్ పోర్టు మినిస్టర్ సువేందు అధికారి స్పందించారు. లక్ష్మణ్ పాల్ అనే వ్యక్తి..ఎలాంటి అనుమతులు లేకుండా..ప్రైవేటుగా జెట్టీని నడుపుతున్నాడని వెల్లడించారు. అనుమతు లేని లేని బోట్లలో ప్రయాణించడం చాలా ప్రమాదకరమన్నారు. సీసీ టీవీ కెమెరాలు, లైవ్ జాకెట్లు, డబుల్ ఇంజిన్ బోట్ల ఉన్న 700 లీగల్ జెట్టీ ఘాట్లను ప్రభుత్వం గుర్తించడం జరిగిందన్నారు.

కొన్ని డబుల్ ఇంజిన్ బోట్లను ప్రారంభించినట్లు, లక్ష్మణ్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. 32 మంది స్వల్పగాయాలతో, ఇద్దరికి తీవ్రగాయాలైనట్లు తనకు సమాచారం వచ్చిందన్నారు. ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు గల్లంతై ఉండే ఛాన్స్ ఉందన్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి అనధికారికంగా జెట్టీ ఘాట్లను ఉపయోగించకూడదన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.