West Bengal Politics : పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమికి ‘సర్’ కారణమా? ఇదిగో లెక్కలు..
West Bengal Elections : అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ద్వారా పశ్చిమ బెంగాల్లో 90 లక్షలకుపైగా ఓటర్లను జాబితా నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది.
West Bengal Elections _ Is Sir the reason for Mamata Banerjee Trinamool Congress defeat
West Bengal Politics : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 206 స్థానాలు గెలుచుకొని తొలిసారి అధికారం దక్కించుకుంది. పదిహేనేళ్ల పాటు నిరంతరాయంగా పాలించిన తృణమూల్ కాంగ్రెస్ 80 స్థానాల్లో మాత్రమే గెలిచింది. దీంతో అధికారాన్ని కోల్పోయింది. మమత బెనర్జీ ముఖ్యమంత్రి పీఠాన్ని దిగిపోవాల్సి వచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ ద్వారా పశ్చిమ బెంగాల్లో 90 లక్షలకుపైగా ఓటర్లను జాబితా నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. రికార్డు స్థాయిలో ఓట్ల తొలగింపు కారణంగానే తాము ఓడిపోయామని.. ప్రజలు మమ్మల్ని ఓడించలేదని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నేతలు సర్ ప్రక్రియ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి అనుకూలించిందని ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణల్లో వాస్తవమెంత? నిజంగానే సర్‌ను అడ్డుపెట్టుకొని 15ఏళ్ల దీదీ సామ్రాజ్యాన్ని కూల్చిందా..? అనే విషయాలను పరిశీలిస్తే.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ కొత్తది కాదు. ఎన్నికల కమిషన్ ఇదే విధమైన ఓటరు జాబితా సవరణ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో గతంలో కూడా నిర్వహించింది. దీనిని కేవలం పశ్చిమ బెంగాల్‌కు మాత్రమే సంబంధించిన రాజకీయ కుట్రగా చూపించడం తప్పుదారి పట్టించే ప్రయత్నమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లోనూ ఎన్నికల ముందు సర్ ప్రక్రియ ద్వారా ఎక్కువ శాతం ఓట్లను తొలగింపు జరిగిందనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు (ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది) లక్షలాది మంది ఓటర్లను జాబితాలో చేర్చడం, తొలగించడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, ఇప్పుడు ఇదే ప్రక్రియను ఓటు దోపిడీగా చెప్పడం రాజకీయ అవకాశవాదం అవుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎన్నికల కమిషన్‌ను నమ్మి.. ఓడిపోయినప్పుడు ఎన్నికల కమిషన్ నిర్ణయాల వల్లనే ఓడిపోయామని అనడం సరికాదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఓటమికి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే ప్రధాన కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే.. ఎక్కువ ఓట్లు తొలగించిన నియోజకవర్గాల్లో టీఎంసీ చాలా స్థానాల్లో విజయం సాధించింది. రాజకీయ విశ్లేషకులు ప్రకారం.. ఓట్ల తొలగింపు స్థాయి ఎక్కువగా ఉన్న స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయాలను నమోదు చేసింది. మరో విషయం ఏమిటంటే.. 2006 నుండి 2011 మధ్య వామపక్షాల పతనం వంటి భారీ రాజకీయ మార్పులను బెంగాల్ గతంలో చూసింది. మళ్లీ 2026 ఫలితాలు కూడా ప్రజాస్వామ్య రాజకీయ మార్పులో భాగమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
