ద్రవిడ పేరు లేకుండా రాజకీయ పార్టీ.. హీరో విజయ్ సంచలన నిర్ణయం.. వర్కౌట్ అవుతుందా?
ద్రవిడ పేరు లేకుండా పార్టీని ఏర్పాటు చేస్తూ ఒకరకంగా విజయ్ సంచల నిర్ణయమే తీసుకున్నారు. మరి ద్రవిడ మార్గాన్ని ఎంచుకుంటారా లేక స్వతంత్రంగా వ్యవహరిస్తారా అన్నది వేచి చూడాలి.

what is challenges for Thalapathy Vijay Party in Tamil Nadu
Thalapathy Vijay: తమిళ హీరో విజయ్ కొత్త పార్టీ ప్రకటన తమిళ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. తమిళ వెట్రి కలగం (Tamizha Vetri Kazhagam) పేరిట పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు హీరో విజయ్ సంచలన ప్రకటన చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తన పార్టీ ముందుకెళుతుందని విజయ్ చెబుతున్నారు. స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే సర్కారు అక్కడ కొనసాగుతోంది. విపక్ష అన్నాడీఎంకే సైతం అక్కడ కాస్త బలంగానే ఉంది. కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలతో పాటు చిన్నాచితక పార్టీలు తమిళనాడులో చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీకి తమిళనాడులో ఏ మేరకు అవకాశం ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
హీరోలు పార్టీలు పెట్టి రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇది మరీ ఎక్కువ. అన్నాదురై శిష్యులుగా సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎంజీఆర్, కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. సొంతంగా పార్టీ పెట్టి ఎన్టీఆర్ సంచలన విజయం సాధించారు. ప్రజారాజ్యం పార్టీని పెట్టిన చిరంజీవి లాంటి వాళ్లు అధికారం దక్కించుకోలేకపోయారు. హీరో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టి అధికారం కోసం శ్రమిస్తున్నారు. ప్రజలకు ఆరాధ్యుడిగా ఉండి, పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం ఎన్టీఆర్ తోనే పోయింది. అటు తర్వాత చాలామంది హీరోలు కుస్తీలు పడుతూనే ఉన్నారు.
విజయ్ ఏమి చేయబోతున్నారు?
రాజకీయాల్లోకి వస్తానని చెప్పి, అభిమానులను ఊరించి చివరకు రజనీకాంత్ లాంటి వ్యక్తులు చేతులు ఎత్తేశారు. మరి ఇప్పుడు హీరో విజయ్ ఏమి చేయబోతున్నారు? ద్రవిడ పేరు లేకుండా పార్టీని ఏర్పాటు చేస్తూ ఒకరకంగా విజయ్ సంచల నిర్ణయమే తీసుకున్నారు. ద్రవిడ భావజాలానికి తమిళ రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. ఏ పార్టీ అయినా అక్కడ ద్రవిడ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడమే అజెండాగా కలిగి ఉంటాయి. విజయ్ కూడా ద్రవిడ మార్గాన్ని ఎంచుకుంటారా లేక స్వతంత్రంగా వ్యవహరిస్తారా అన్నది వేచి చూడాలి.
Also Read: తమిళ హీరో విజయ్ పార్టీ పేరు.. అర్థం ఏంటో తెలుసా..?
దళపతి టార్గెట్ రీచ్ అవుతారా?
నిజానికి తమిళనాడులో సీఎం స్టాలిన్ సర్కారు కంఫర్ట్ గా ఉంది. ప్రతిపక్ష అన్నాడీఎంకే నుంచి కూడా ఆయనకు పెద్దగా సమస్యలు లేవు. తమిళ రాజకీయాలను ఐదు దశాబ్దాల పాటు శాసించిన కరుణానిధి, జయలలిత మరణం తర్వాత తమిళులకు ఆ స్థాయి నేతగా ఒక్క స్టాలిన్ మాత్రమే కనిపిస్తున్నారు. ఈ కారణంగానే రెండేళ్ల క్రితం జరిగిన తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. చాలా కూల్ గానే అక్కడ స్టాలిన్ పార్టీని, ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారు. అన్నాడీఎంకే లోని విభేదాలు, పార్టీపై పట్టు కోసం పన్నీరు సెల్వం, పళనిస్వామి, శశికళ వర్గాలు పోటీపడం లాంటి పరిణామాలన్నీ స్టాలిన్ కు అనుకూలంగా మారాయి. వారందరినీ పక్కకు తోసి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే సర్కార్ కి ప్రజలు పట్టం కట్టారు. ఇప్పుడు విజయ్ పార్టీకి తమిళనాట పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందా అన్నదే వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారింది. అక్కడ లెక్కకు మిక్కిలిగా ఉన్న పార్టీలను పక్కకు తోసుకొని దళపతి ముందుకు రావాలి. ఒక్క సినీ గ్లామర్ తోనే సీఎం అయ్యే రోజులు నేడు లేవు. దీనిని అధిగమించి ఆయన టార్గెట్ ఎలా రీచ్ అవుతారన్నది తమిళ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.