పాకిస్థాన్‌కి చుక్కలు చూపించిన మన ఆయుధాలు ఇవే..

ఈ ఐదు ఆయుధాల ప్రత్యేకతలు ఏంటో చూద్దాం..

పాకిస్థాన్‌కి చుక్కలు చూపించిన మన ఆయుధాలు ఇవే..

Updated On : May 10, 2025 / 7:11 PM IST

పాకిస్థాన్ చేస్తున్న దాడులను భారత్‌ సమర్థవంతంగా తిప్పికొట్టింది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పీవోకే, పాకిస్థాన్‌ భూభాగంలో మే 7న భారత్ “ఆపరేషన్ సిందూర్” నిర్వహించడంతో పాక్‌ రెచ్చిపోయింది.

పాకిస్థాన్‌ దాడులకు తెగబడవచ్చని భారత్‌ ముందుగానే అంచనా వేసి వాటిని తిప్పికొట్టడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకుంది. భారత భూభాగంలో దాడుల కోసం పాక్‌ పంపుతున్న డ్రోన్లు, మిసైళ్లను గగనతలంలోనే భారత్‌ పేల్చి వేసింది.

పాకిస్థాన్ దాడులను తిప్పొకొట్టడానికి భారత్‌ వద్ద సమర్థవంతమైన గగనతల రక్షణ వ్యవస్థ ఉంది. డ్రోన్లు, క్షిపణులను వెంటనే గుర్తించి భారత్‌ వాటిని ధ్వంసం చేసింది. మన దగ్గర శత్రు డ్రోన్లను అడ్డుకునే ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్‌ గ్రిడ్ వ్యవస్థ ఉంది.

దాడులను అడ్డుకోవడానికి భారత్‌ C-UASను వాడింది. C-UAS అంటే కౌంటర్-అన్‌మ్యాన్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్. యుద్ధ విమానాలను గుర్తించి, పేల్చేయడానికి భారత్‌ S-400 ట్రయంఫ్ సిస్టమ్ (లాంగ్ రేంజ్ డిఫెన్స్)ను వాడుతోంది.

అలాగే, భారత్‌ వద్ద MR-SAM (మీడియం రేంజ్ సర్‌ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్), బరాక్ 8 వ్యవస్థలు కూడా ఉన్నాయి. మన వద్ద ఉన్న ఆకాశ్ సిస్టమ్ స్వదేశీ రక్షణ వ్యవస్థ. 30 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది. ఇజ్రాయెల్‌కు చెందిన స్పైడర్ సిస్టమ్ కూడా మన వద్ద ఉంది.

Also Read: పాకిస్థాన్‌కు భారత్ వార్నింగ్.. ‘ఇంకోసారి టెర్రర్ ఎటాక్ జరిగిందో..’

ఇవేగాక, పెచోరా, కాజ్, సమర్, ఏడీ గన్స్‌ వంటి వాటిని కూడా వాడుతున్నట్లు భారత సైన్యం తాజాగా ప్రకటించింది. ఈ ఐదు ఆయుధాల ప్రత్యేకతలు ఏంటో చూద్దాం..

పెచోరా
ఇది మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్. 1970 నుంచి వీటిని మనం వాడుతున్నాం. డ్రోన్ల వంటి వాటికి టార్గెట్‌ చేసి ధ్వంసం చేస్తుంది. పాక్‌ డ్రోన్లను కూల్చేయడంతో వీటిది కీలక పాత్ర. పెచోరాలో రాడార్‌ బేస్డ్‌ మిసైల్‌ లాంచర్‌తో పాటు ఫైర్‌ కంట్రోల్‌ యూనిట్లు ఉన్నాయి. వీ-600 మిసైళ్లను ప్రయోగించడం వీటి ప్రత్యేకత. శత్రువులు ఎలక్ట్రానిక్‌ జామింగ్‌ చేయడానికి ప్రయత్నించినా సమర్థంగా అడ్డుకుంటుంది. శత్రుదేశాల డ్రోన్ల వంటి వాటిని 100 కిలోమీటర్ల దూరం ఉండగానే గుర్తిస్తుంది.

కాజ్
ఇది కౌంటర్-అన్‌మ్యాన్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్. శత్రుదేశాల డ్రోన్‌లను గుర్తించి, ట్రాక్ చేయడం, పేల్చేయడం అనే మూడు విధాలుగా ఇది పనిచేస్తుంది. వీటిని ఇంద్రజాల్ అని, భార్గవాస్త్ర అని పిలుస్తారు. గగనతల రక్షణ వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ శత్రు డ్రోన్లను కూల్చేస్తుంది. మల్టీ సెన్సర్‌ డిటెక్షన్‌తో పాటు సాఫ్ట్‌, హార్డ్‌ కిల్‌ సామర్థ్యం ఉంది. తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లను కూల్చుతుంది.

సమర్
గగనతలంలోని లక్ష్యాలను భూమి నుంచి ఛేదిస్తుంది సమర్‌ వ్యవస్థ. భారత వైమానిక దళంలో ఇది ముఖ్యమైన వ్యవస్థ. స్వల్ప శ్రేణి లక్ష్యాలను ఛేదిస్తుంది. డ్రోన్లనే కాదు హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు కూల్చే శక్తి దీనికి ఉంది.

ఏడీ గన్స్
ఎల్‌-70 వంటి ఎయిన్‌ డిఫెన్స్ గన్స్‌ మన వద్ద ఉన్నాయి. రాడార్లతో పాటు ఎలక్ట్రో ఆప్టికల్‌ సెన్సర్లు, ఆటో ట్రాకింగ్‌ వ్యవస్థ ఇందులో ఉంటుంది. ఒక్కో నిమిషానికి 240 – 330 రౌండ్లు పేల్చుతాయి. వీటి పరిధి 4 కిలోమీటర్లు. వీటితో పాటు షిల్కా అనే జెడ్‌ఎస్‌యూ-24-4 గన్స్‌ కూడా ఉన్నాయి. నిమిషానికి 4,000 రౌండ్లు పేల్చుతాయి. వీటితో మన రక్షణ వ్యవస్థ మరింత పటిష్ఠంగా ఉంటోంది.