అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై పరిమితులు ఇలా ఉంటాయని తెలుసా? ప్రతిదానికి ఓ రేటు..

చెన్నైలో 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే చాయ్‌ ధరను 10 రూపాయల నుంచి 15కు పెంచింది ఈసీ.

అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై పరిమితులు ఇలా ఉంటాయని తెలుసా? ప్రతిదానికి ఓ రేటు..

Lok Sabha Elections 2024

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. ప్రచార ఖర్చు కోసం అభ్యర్థులు డబ్బుల వేటలో ఉంటే.. ఈసీ మాత్రం డేగ కన్నుతో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ప్లాన్ చేస్తోంది. అబ్జర్వర్లును నియమించడంతో పాటు.. ప్రచారంలో అభ్యర్థులు వాడే ప్రతిదానికి ఓ రేటును ఫిక్స్ చేసింది ఈసీ. ఆ రేటు ప్రకారమే క్యాండిడేట్ ఎన్నికల ఖర్చును లెక్కేయనున్నారు అధికారులు.

అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై గరిష్ట పరిమితులు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి 95 లక్షలు మించి ఖర్చు పెట్టొద్దని ఈసీ రూల్స్ పెట్టింది. అరుణాచల్, గోవా, సిక్కిం రాష్ట్రాల్లో అయితే 75 లక్షలు దాటొద్దు. కేంద్రపాలిత ప్రాంతాల్లో 75 నుంచి 95 లక్షల మధ్య ఖర్చు పెట్టేలా ఎన్నికల నిబంధనలున్నాయి. నామినేషన్‌ వేసినప్పటి నుంచి ఫలితాలు వెల్లడించే తేదీ దాకా అభ్యర్థులు పెట్టే వ్యయం ఈ పరిమితిని దాటకుండా ఈసీ నిఘా పెడుతూ వస్తూ ఉంటోంది.

ఎన్నికల ఖర్చు పరిమితి ఇట్లుంటే.. ఒక్కో ఐటమ్‌కు ఈసీ నిర్ణయించిన రేట్లు ఇంకో విధంగా ఉన్నాయి. వాస్తవ రేట్లు ఒక విధంగా ఉంటే ఈసీ పెట్టిన రేట్లు చాలా తక్కువగా ఉన్నాయంటున్నాయి పార్టీలు. ఇలా అయితే అభ్యర్థులు ఈసీకి ఎన్నికల ఖర్చును చూపించడం పెద్ద తలనొప్పిగా మారుతుందంటున్నారు.

ఒక్కో స్టేట్‌కు ఒక్కో విధంగా
ఈసీ నిర్ణయించిన రేట్స్ ఒక్కో స్టేట్‌కు ఒక్కో విధంగా ఉన్నాయి. టీ, సమోసా, చికెన్, మటన్‌ రేట్లను ఒక్కో ప్రాంతానికి ఒక్కో విధంగా డిసైడ్ చేసింది ఈసీ. చాయ్‌కి పంజాబ్‌లోని జలంధర్‌లో 15 రూపాయలుగా నిర్ణయించారు అధికారులు. మధ్యప్రదేశ్‌లోని మాండ్లాలో టీ ధర 7 రూపాయలు మాత్రమేనని డిసైడ్ చేశారు. సమోసా కూడా పంజాబ్‌లో 15 రూపాయలు అయితే..మధ్యప్రదేశ్‌లో ఏడున్నరగా చెబుతున్నారు.

బ్యానర్లు, ఫ్లెక్సీలు, సభావేదికలు మొదలు జనాలకు అందించే ఫుడ్ దాకా ప్రతిదానికీ రేటును ఫిక్స్‌ చేస్తుంది. ఈసీ నిర్ణయించిన రేట్లు.. వాస్తవ ధరకు చాలా తేడా ఉంది. దాంతో ఈసీ మెనూ కార్డుపై సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయి. చాయ్‌ ధరను దేశవ్యాప్తంగా ప్రాంతాన్ని బట్టి 5 నుంచి 15 రూపాయల వరకు ఈసీ నిర్ధారించింది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో కప్పు చాయ్‌ ఐదురూపాయలు, సమోసా రూ.10. ఇడ్లీ, సాంబార్‌ వడా, పోహా, జిలేబీ ప్లేటు రూ.20. దోసా, ఉప్మా మాత్రం ప్లేటు 30 రూపాయలుగా డిసైడ్ చేసింది ఈసీ.

మణిపూర్‌లోని తౌబల్‌ జిల్లాలో చాయ్, సమోసా, కచోరీ, ఖజూర్, గాజా ఒక్కోటీ పది రూపాయలుగా నిర్ణయించారు అధికారులు. మణిపూర్‌లోని తెంగ్‌నౌపాల్‌ జిల్లాలో బ్లాక్‌ టీ ఐదు రూపాయలు, సాదా టీ పది రూపాయలు, బాతు మాంసం మూడువందలు, పంది మాంసం 4వందలుగా మెనూ రేట్లను ఫిక్స్ చేశారు. జలంధర్‌లో ప్లేటు చోలే భటూరేకు ఈసీ నిర్ధారించిన ధర రూ.40. కిలో చికెన్‌కు 250, మటన్‌కు 500. గ్లాసు లస్సీ 20 రూపాయలు, నిమ్మరసం 15 రూపాయలని రేటు ఫిక్స్ చేసింది ఈసీ.

చెన్నైలో 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే చాయ్‌ ధరను 10 రూపాయల నుంచి 15కు పెంచింది ఈసీ. కాఫీ కూడా రూ.15 నుంచి రూ.20కి పెరిగింది. కానీ చికెన్‌ బిర్యానీ ధరను మాత్రం 180 నుంచి 150 రూపాయలకు తగ్గించింది ఈసీ. ఢిల్లీ నోయిడా పరిధిలోని గౌతంబుద్ధ నగర్‌లో వెజ్‌ భోజనం వంద రూపాయలు. సమోసా, చాయ్‌ ధర పదిరూపాయలు, కచోరీ రూ.15, శాండ్‌విచ్‌ రూ.25, జిలేబీ కిలో 90 రూపాయలని ఈసీ మెనూలో మెన్షన్ చేసింది.

ఖరీదైన వాటికి..
ఖరీదైన హెలీప్యాడ్లు, లగ్జరీ వెహికల్స్ తో పాటు పూలు, కూలర్లు, టవర్‌ ఏసీలు, సోఫాల వంటివాటికి కూడా ఈసీ రేట్లు నిర్ధారించింది. సభలు, సమావేశాలకు జనాన్ని తరలించేందుకు బస్సులు, టాటా సఫారీ, స్కార్పియో, హోండా సిటీ, సియాజ్‌… ఇలా బ్రాండ్లవారీగా కూడా ఒక్కో వాహనానికి ఒక్కో రేటు నిర్ణయించింది. పూలదండల్లో కూడా గులాబీ, బంతి… ఇలా రకాలను బట్టి రేటు ఫిక్స్ చేశారు. పార్టీల జెండాలు, టోపీల కూడా ఓ రేటుంది.

మార్కెట్‌ రేట్ల కన్నా ఈసీ నిర్ణయించిన ధరలు తక్కువగా ఉన్నాయనేది పార్టీల వాదన. ఏ అభ్యర్థి అయినా ఎన్నికల సంఘం నిర్ణయించిన పరిమితిలోపు ఎన్నికలను పూర్తి చేయడం కష్టం. ఇప్పుడు ఈసీ నిర్ణయించిన మెనూ రేట్ల ప్రకారమైతే ఇంకా కష్టమంటున్నారు అభ్యర్థులు.

Also Read: దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరిలో ఆధిపత్యమెవరిది?