WhatsApp Ban : వాట్సాప్ సంచలనం.. 20లక్షల భారతీయుల ఖాతాలు బ్యాన్

ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా కఠినచర్యలు తీసుకుంది. భారతీయుల ఖాతాలపై కొరడా ఝుళిపించింది.

WhatsApp Ban : వాట్సాప్ సంచలనం.. 20లక్షల భారతీయుల ఖాతాలు బ్యాన్

Whatsapp Ban

Updated On : July 15, 2021 / 11:11 PM IST

WhatsApp Ban : ఫేస్ బుక్ ఆధ్వర్యంలోని ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా కఠినచర్యలు తీసుకుంది. భారతీయుల ఖాతాలపై కొరడా ఝుళిపించింది. భారత్ లో ఏకంగా 20 లక్షలకు పైగా ఖాతాలను తొలగించింది. తన నెలవారీ నివేదికలో వాట్సాప్ ఈ మేరకు తెలిపింది. హానికరమైన ప్రవర్తనతో కూడిన ఖాతాలను, అనవసరమైన సందేశాలను పంపే ఖాతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వాట్సాప్ తేల్చి చెప్పింది. మే 15 నుంచి జూన్ 15 మధ్యన ఈ ఖాతాలను నిలిపివేసినట్టు తెలిపింది.

ఇలాంటి ఖాతాలను ముందే గుర్తించడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, హాని జరిగాక స్పందించడం కంటే, ముందే చర్యలు తీసుకోవడం సబబు అని భావిస్తున్నట్టు తన నివేదికలో తెలిపింది. అవాంఛనీయ ఖాతాలను గుర్తించేందుకు అనువైన సాధనాలను ఏర్పాటు చేశామని వాట్సాప్ వెల్లడించింది. ఇలాంటి ఖాతాలను గుర్తించే ప్రక్రియ మూడు దశలు కలిగి ఉంటుందని, రిజిస్ట్రేషన్, సందేశాలు పంపే సమయం, ఫిర్యాదులు ఆధారంగా స్పందిస్తామని వివరించింది. హానికరమైన, అనవసరమైన సందేశాలను పంపే ఖాతాలను అరికట్టడంపై తాము దృష్టి సారించినట్లు వాట్సాప్ తెలిపింది. అనధికారికంగా బల్క్ మేసేజింగ్ వాడకం వల్లే ఎక్కువ ఖాతాలను బ్యాన్ చేసినట్లు వివరించింది.

దేశంలో 5 మిలియన్ల యూజర్లు ఉన్నారు. కొత్త ఐటీ చట్ట ప్రకారం సోషల్ మీడియా యాప్ లు ప్రతి నెల కేంద్రానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ సైతం ఈ నెలలో ఇదివరకే తమ నెలవారీ నివేదికలు కేంద్రానికి సమర్పించాయి.