INDIA Alliance: ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీ బయటకు.. ఎందుకిలా జరుగుతోంది?

ఇంతకీ ఈ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు ఏయే పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి? వాళ్ల రాజకీయ వ్యూహాలు ఏంటి?

INDIA Alliance: ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీ బయటకు.. ఎందుకిలా జరుగుతోంది?

why AAP Congress may bunk INDIA alliance in Punjab and left parties in Kerala Bengal

Updated On : September 20, 2023 / 5:51 PM IST

INDIA Alliance Parties: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేను ఈసారి ఎలాగైనా గద్దె దించాలన్న లక్ష్యంతో ఏర్పాటైంది ఇండియా కూటమి. 26 ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఏర్పాటైన ఈ కూటమికి ఆదిలోనే హంస పాదు ఎదురవుతోందా? 2024 ఎన్నికల్లో (2024 Elections) ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్న ఈ అలయెన్స్ నుంచి ఒక్కో పార్టీ బయటకు వెళ్తోందా? తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అదే నిజమని అనిపిస్తోంది. ఇంతకీ ఈ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు ఏయే పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి? వాళ్ల రాజకీయ వ్యూహాలు ఏంటి? అలయెన్స్ నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఆ పార్టీలకు కలిగే లాభమేంటి?

2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో మోదీ సర్కారుని (Modi Govt) ఎదుర్కోవడానికి 26 ప్రతిపక్ష పార్టీలు (Opposition Parties) ఏకమై పోరాడడానికి సిద్ధమయ్యాయి. ఒకే వేదికపైకి వచ్చిన ఆ పార్టీలన్నీ కలిసి తమ కూటమికి ఇండియన్ నేషనల్ డిమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్‌ (Indian National Developmental Inclusive Alliance) అనే పేరును ఖరారు చేశాయి. అంతేకాదు.. ఒకసారి ముంబైలో, రెండోసారి బెంగళూరు వేదికగా రెండుసార్లు సమావేశాలు కూడా నిర్వహించాయి ఈ పార్టీలు.

ఎవరికి వారు ప్రధాని పదవిపై ఆసక్తి లేదని.. కేవలం మోదీ సర్కారును ఓడించడమే లక్ష్యమని ప్రకటించుకున్నారు. అందుకోసం రాష్ట్ర స్థాయిలో తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగుతామని చెప్పుకొచ్చారు వారంతా. ఓవైపు ఈ కూటమి సమావేశాలు కొనసాగుతుండగానే.. మరోవైపు ఈ అలయెన్స్ నుంచి ఒక్కో పార్టీ బయటకు వచ్చే ప్రయత్నాలు ప్రారంభించాయి.

పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఇండియా కూటమికి దూరంగా ఉండాలని వామపక్షాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బెంగాల్‌లో టీఎంసీ, కేరళలో కాంగ్రెస్ పార్టీలు తమ ప్రధాన ప్రత్యర్థులని, ప్రతిపక్షాల ఓటు చీలకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఢిల్లీలో ఇటీవల జరిగిన సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది. సీపీఎం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Also Read: చంద్రబాబు అరెస్ట్ పై హీరో విశాల్ కామెంట్స్.. భయం కలుగుతోంది అంటూ..

మరోవైపు.. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ కూటమిలో భాగస్వామిగా ఉంది. కానీ.. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన ఆ పార్టీ.. తాజాగా బీహార్‌లో కూడా పోటీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో బీహార్ యూనిట్ సమావేశం నిర్వహించిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. బీహార్‌లో జేడీయూ, బీజేపీ కూటమి పాలనతో పాటు ప్రతిపక్ష ఆర్జేడీ పాలనను చూసి విసుగు చెందిన బీహార్ ప్రజలకు తామే ప్రత్యామ్నాయం అని భావిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ.

Also Read: కాంగ్రెస్ పార్టీలో చేరిన టాలీవుడ్ యంగ్ హీరో..

ఇక పంజాబ్‌లోనూ తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు ఆ రాష్ట్ర మంత్రి అన్మోల్ గగన్ మాన్. (Anmol Gagan Maan) పంజాబ్‌లో పొత్తులు ఉండవన్న ఆమె.. మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో తామే పోటీ చేస్తామని తెలిపారు. జాతీయ స్థాయిలో పొత్తులపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నా.. పంజాబ్‌లో మాత్రం కూటమి ఉండదని ప్రకటించారామె. అయితే.. పంజాబ్‌లో ఆప్‌తో పొత్తు ఉండదని కొందరు కాంగ్రెస్ నేతలు కూడా చెబుతున్నారు. ఆ పార్టీ చేసిన వ్యాఖ్యల గురించి పార్టీ జాతీయ నాయకత్వానికి వివరిస్తామన్న పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా.. అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నామన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఇప్పటికే దీనిపై సూచనలు కూడా ఇచ్చారని ప్రకటించారు అమరీందర్.

Also Read: నితీశ్ కుమార్ ప్రధాని అభ్యర్థిత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అమిత్ షా

మొత్తంగా ఎన్డీయేకు వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్న ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీ బయటకు వచ్చే ప్రయత్నాలు చేయడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ మాదిరిగానే మరికొన్ని పార్టీలు కూడా అలయెన్స్ నుంచి బయటకు వస్తే పరిస్థితి ఏంటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.