నితీష్ వ్యూహమేంటి : 35ఏళ్లుగా MLAగా పోటీ చేయట్లేదు…5సార్లు సీఎం

Nitish Kumar never contested Assembly elections in last 35 years ప్రస్తుతం బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. . మొత్తం 3దశల్లో జరుగనున్న పోలింగ్ లో భాగంగా అక్టోబర్-28న 16జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే పోలింగ్ జరిగింది. నవంబర్-3న రెండో దశ పోలింగ్ కు ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. 94 స్థానాలకు మంగళవారం పోలింగ్ జరుగనుంది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. 2005నుంచి బీహార్ సీఎం పీఠంపైనే కూర్చున్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ వరుసగా నాలుగోసారి తనకు సీఎం అయ్యే ఛాన్స్ ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు.
అయితే, ఇప్పటివరకు ఐదుసార్లు బీహార్ సీఎంగా పనిచేసిన నితీష్ కుమార్ గురించి ఓ ఆశక్తికర విషయం ఏంటంటే…35ఏళ్లుగా ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేయలేదు. గత 35 సంవత్సరాల్లో నితీష్ కుమార్ ఒక్కసారి కూడా అసెంబ్లీకి పోటీ చేయలేదు…. కానీ, 5సార్లు సీఎం అయ్యారు. 2000 (8 రోజులు), 2005, 2010, 2015, 2017లో మొత్తం 5సార్లు సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం చేశారు. నితీష్ కుమార్ ఇప్పటికీ MLC(శాసనమండలి సభ్యుడు)గానే కొనసాగుతున్నారు.
1977 ఎన్నికల్లో నితీష్ కుమార్ తొలిసారి నలంద జిల్లాలోని హర్నౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1985లో మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయకపోయినా ఆయన లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేసి ఆరు సార్లు (1989, 1991, 1996, 1998, 1999, 2004)గెలుపొందారు.
మార్చి-3,2000న మొదటిసారిగా బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. అయితే, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు నితీష్ కుమార్ బీహార్ ఉభయసభల్లోని ఏ సభలో కూడా సభ్యుడు కాదు. అయితే, అసెంబ్లీలో తగిన సంఖ్యా బలాన్ని నిరూపించుకోలేకపోవడంతో 8 రోజుల్లోనే సీఎం పదవిని కోల్పోయారు. 2005 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమి విజయం సాధించినప్పుడు నితీష్ కుమార్ రెండోసారి సీఎం అయ్యారు. అప్పుడు కూడా ఆయన బీహార్ ఉభయ సభల్లో సభ్యుడు కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) నిబంధన ప్రకారం… ఉభయ సభల్లో సభ్యుడు కాని వ్యక్తి ముఖ్యమంత్రి లేదా మంత్రి అయితే… ప్రమాణస్వీకారం చేసిన 6 నెలల్లోపు ఏదో ఒక సభలో(అసెంబ్లీ లేదా శాసనమండలి) సభ్యుడు కావాలి. దీంతో నితీష్ కుమార్ 2006లో శాసనమండలికి ఎన్నికయ్యారు.
2010ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమి మరోసారి ఘన విజయం సాధించింది. దీంతో మూడోసారి మళ్లీ సీఎం అయ్యారు. 2012లో రెండోసారి నితీష్ ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత 2015లో జరిగిన ఎన్నికల్లో జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించి నితీష్ కుమార్ సీఎం అయ్యారు. నితీష్ రెండోసారి ఎమ్మెల్సీ పదవీకాలం 2018లో ముగియడంతో..2018లో మూడోసారి ఎమ్మెల్సీ అయ్యారు. 2024 వరకు నితీష్ ఎమ్మెల్సీగా కొనసాగుతారు.
కాగా, 35 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి ఒక్కసారి కూడా పోటీ చేయకుండా ఐదుసార్లు సీఎం అయిన నితీష్ కుమార్ మీద ప్రతిపక్షాలు తరుచూ విమర్శలు గుప్పిస్తుంటాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే సత్తా ఆయనకు లేదని విమర్శిస్తుంటాయి. అయితే, తాను ఇష్ట ప్రకారం ఎమ్మెల్సీ అయ్యాయని, కచ్చితంగా ఎమ్మెల్సీనే అవ్వాలనేది తన అభిమతం కాదని గతంలో పలు సందర్భాల్లో నితీష్ వివరణ ఇచ్చారు. తన దృష్టి పరిమితి ఒక్క సీటుకే పరిమితం కాకుడదని తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని 2015 ఎన్నికల సమయంలో నితీష్ వ్యాఖ్యానించారు.
మరోవైపు, ప్రస్తుతం జరగుతున్న బీహార్ ఎన్నికల్లో మహాకూటమి విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్.. నితీష్ కుమార్ కు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేదంటూ తరచుగా విమర్శిస్తున్నారు. నితీష్ కుమార్‌కు సత్తా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని, ఆయన ఎక్కడ పోటీ చేస్తే తాను కూడా అక్కడ పోటీ చేస్తానని సవాల్ విసిరారు. అయితే తేజస్వీ సవాల్ ని లైట్ తీసుకున్నారు నితీష్. తన ఎన్నికల ప్లాన్ తో కొనసాగాలని నితీష్ నిర్ణయించుకున్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ-ఇతర చిన్న పార్టీలు కలిసి పోటీచేస్తుండగా..ఆర్‌జేడీ-కాంగ్రెస్-మూడు లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీచేస్తున్నాయి. ఇక,కేంద్రంలో ఎన్డీయేలో భాగస్వామి అయినప్పటికీ బీహార్ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ(LJP)స్వతంత్రంగా పోటీ చేస్తోంది.