రతన్ టాటా కారు నెంబర్‌నే ఫోర్జరీ చేసింది… ఈ చలాన్లతో మహిళ మోసం బట్టబయలు

Ratan Tata’s car ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు చెందిన కారు నెంబర్ ప్లేట్‌ను ఫోర్జరీ చేసిన కేసులో ఓ మహిళను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై పోలీసులు తెలిపిన ప్రకారం… గీతాంజలి సామ్ షా అనే ఓ మహిళ తన బీఎండబ్యూ కారుకి…రతన్ టాటాకు చెందిన కారు నెంబర్ ను ఉపయోగించింది. రతన్ టాటాకు చెందిన కారు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినట్లు టాటా సన్స్ ఆఫీసుకు ఈ-చలాన్లు వెళ్లాయి.
దీంతో అప్రమత్తమైన టాటా గ్రూప్ ఉద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. తమ కారుతో ఎటువంటి ఉల్లంఘనలు జరగలేదని,బోగస్ నెంబర్ ప్లేట్ తో ఎవరో కారు నడుపుతున్నారని ట్రాఫిక్ పోలీసులకు ఇటీవల కంప్లెయింట్ చేశారు. దీంతో ఈ-చలాన్లు జారీ అయిన ప్రదేశాలను సీసీటీవీ ఫూటేజ్ ద్వారా ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు.
రతన్ టాటా కారు నెంబర్ ప్లేట్‌తో ఓ మహిళ కారును నడుపుతున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ కారు నెంబర్‌ను వాడుతున్న ఆ మహిళపై పలు ఐపీసీ సెక్షన్ల కింద,మోటర్ వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. రతన్ టాటా నెంబర్‌కు పంపిన మూడు ఈ-చలాన్లను మళ్లీ ఆ మహిళకు పంపినట్లు పోలీసులు తెలిపారు. మహిళను అరెస్ట్ చేశామని..విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
కాగా, ఆ కారు నెంబర్ రతన్ టాటాకు చెందినట్లు తనకు తెలియదని, న్యూమరాలజిస్ట్ చేసిన సూచన మేరకు తాను ఆ నెంబర్ ప్లేట్‌ను వాడుతున్నట్లు ఆ మహిళ ట్రాఫిక్ పోలీసులకు తెలియజేసింది. జీవితంలో మంచి జరగాలంటే ఆ నెంబర్ ప్లేట్ ఉండాలని తనకు సంఖ్యాశాస్త్ర నిపుణుడు చెప్పినట్లు ఆమె తెలిపింది.