నడుస్తున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం: నిర్భయ తరహా ఘటన

woman gangraped on moving bus: ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగటం లేదు. మూడు నెలల క్రితం జూని 19 న యూపీలోని ప్రతాప్ ఘడ్ నుంచి నోయిడాకు వెళ్తున్న స్లీపర్ బస్సలో 25 ఏళ్ల మహిళను కత్తులతో బెదిరించి డ్రైవర్, క్లీనర్ అత్యాచారం చేశారు. ఆ ఘటన మరువక ముందేఉత్తర ప్రదేశ్ లో నిర్భయ తరహా ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. అనంతరం మహిళను బస్సులోంచి కిందకు తోసేశారు.
మీరట్ లోని ఢిల్లీ రోడ్డులో సెప్టెంబర్ 26 శనివారం తెల్లవారుఝూమున ఓ మహిళ అపస్మారక స్ధితిలో కనిపించింది. స్ధానికులు ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్దలానికి వచ్చి మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
శుక్రవారం రాత్రి బాధిత మహిళ భైసాలి బస్టాండ్ లో బస్సు ఎక్కింది. బస్సులోని సిబ్బంది ఆమెకు కూల్ డ్రింక్ ఆఫర్ చేశారు. అమె కూల్ డ్రింక్ తాగిన తర్వాత మత్తులోకి వెళ్లి స్పృహ కోల్పోయింది. అంత వరకు ఆమెకు తెలిసింది. స్పృహ కోల్పోయిన మహిళపై డ్రైవర్, కండక్టర్ రాత్రంతా అత్యాచారం చేశారని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం లో తెలిపింది.
అత్యాచారం చేసిన అనంతరం బస్సులోంచి మహిళను డ్రైవర్, కండక్టర్ కిందకు తోసి వేశారు. బాధితురాలిని పరీక్షించిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగిందని స్పష్టం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలు ఎక్కిన స్టేజి లో సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నారు. మీరట్ ఎస్ఎస్పీ అజయ్ సాహ్ని నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.