5 కిలోమీటర్లు : మంచమే అంబులెన్స్..దారిలోనే ప్రసవం  

  • Published By: veegamteam ,Published On : September 9, 2019 / 04:07 AM IST
5 కిలోమీటర్లు : మంచమే అంబులెన్స్..దారిలోనే ప్రసవం   

Updated On : September 9, 2019 / 4:07 AM IST

బిడ్డకు జన్మనివ్వటం మహిళకు పునర్జన్మలాంటిది. అటువంటి పరిస్థితుల్లో పురిటి నొప్పులతో అల్లాడిపోతున్న ఓ గర్భిణీని హాస్పిటల్ కు తరలించేందుకు డోలీ కట్టి తీసుకురావాల్సిన దుస్థితి నెలకొంది. ఇటువంటి ఘటనలు భారతదేశ వ్యాప్తంగా ఎన్నో జరిగాయి. జరుగుతున్నాయి. ఇదే పరిస్థితి అస్సాంలోని చిరాంగ్‌లోని ఉదల్‌గిరి గ్రామంలో నెలకొంది. గర్భిణీకి నెలలు నిండాయి. పురిటి నొప్పులు వచ్చాయి. కానీ దగ్గరలో ఎటువంటి ఆరోగ్య కేంద్రాలు లేవు. తల్లినీ బిడ్డను దక్కించుకోవటానికి గర్భిణీని మంచంపై  పడుకోబెట్టి..డోలీలా తయారు చేశారు. పైన ఓ టార్పాలిన్ క్లాత్ ను కప్పి..ఓ పెద్ద కర్రకు మంచాన్ని కట్టి.. ఇద్దరు వ్యక్తులు 5 కిలోమీటర్ల దూరం కాలినడకన కావడిలా మోసుకుంటూ ఆరోగ్య కేంద్రానికి తీసుకు వచ్చారు. ఈ క్రమంలో దారిలోనే గర్భిణికి నొప్పులు ఎక్కువై బిడ్డకు జన్మనిచ్చింది. ఎట్టకేలకు ఆరోగ్య కేంద్రానికి ఆమెను చేర్చటంతో ప్రస్తుతం తల్లీ బిడ్డలకు క్షేమంగా ఉన్నారు. 

కానీ అన్ని వేళలా ఇలా జరగకపోవచ్చు..దారిలో ఏదైనా ప్రమాదం జరగొచ్చు..తల్లీ బిడ్డలకు ప్రాణాపాయం సంభవించవచ్చు. అలాంటి ఘటనలు జరిగిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసీలు వంటి అడవి బిడ్డలకు అంబులెన్స్‌లు ఏమాత్రం అందుబాటులో ఉండటంలేదు. దీంతో విషజ్వారాలు ప్రబలిన సందర్భంలో వారి ప్రాణాలు కోల్పోతున్నారు..పురిటి నొప్పులతో గర్భిణీలు అల్లాడిపోతున్న వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించాలంటే కాలినడకే తప్ప మరో మార్గంలోని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. 

అభివృద్ధి అంటే ఆకాశాన్నంటే భవనాలు..టెక్నాలజీ మాత్రమే కాదు దేశంలోని ప్రతీ పౌరుడు..ఆరోగ్యంగా బ్రతికే హక్కుని కల్పించాలి. అటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకున్నప్పుడే అసలైన ఆరోగ్య భారతం వస్తుంది. అభివృద్ధిలో భారత్ దూసుకుపోతోంది అని చెప్పే పాలకులు స్వతంత్ర్య వచ్చిన ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కానీ కనీస వైద్య సదుపాయాలు కూడా అందని గ్రామాలు..ప్రాంతాలు ఈనాటికీ ఉండటం దురదృష్టకరం.