Women Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లు.. నెక్ట్స్ ఏంటి?
Women Reservation Bill : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. అయితే, ప్రస్తుతం ఎన్డీయే సర్కార్ న్యూ ప్లాన్ ఏమిటి..? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
Modi-Amit Shah
- లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు
- అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు
- ఎన్డీయే నెక్ట్స్ ప్లాన్ ఏమిటి..?
- రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
Women Reservation Bill : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. ఏప్రిల్ 17వ తేదీన లోక్ సభలో జరిగిన ఓటింగ్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ లేకపోవడంతో బిల్లు వీగిపోయింది. లోక్‌సభలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తీసుకొచ్చిన బిల్లు మీద స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఓటింగ్‌ను చేపట్టారు. ఈ సందర్భంలో 528 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో 298ఓట్లు రిజర్వేషన్లకు అనుకూలంగా వచ్చాయి. 230 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. వాస్తవానికి ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి పోలైన మొత్తం ఓట్లలో (528) మూడింట రెండు వంతుల ఓట్లు అనుకూలంగా రావాలి. అంటే 352 ఓట్లు అనుకూలంగా రావాలి. కానీ 298 మాత్రమే వచ్చాయి. 54 ఓట్లు తక్కువగా వచ్చాయి. కాబట్టి బిల్లు వీగిపోయింది.
Also Read : Gold Rate Today : అక్షయ తృతీయ వేళ బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
మోదీ హయాంలో తొలిసారి..
2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక గవర్నమెంట్ తెచ్చిన ప్రతి బిల్లు ఏదో ఒక రకంగా పాస్ అయింది. వీగిపోయిన బిల్లు ఇదే మొదటిది. అలాగే, 2011 నుంచి ఇప్పటి వరకు ప్రవేశ పెట్టిన అన్ని రాజ్యాంగ సవరణ బిల్లులు పాస్ అయ్యాయి. కానీ, ఈ బిల్లు మాత్రం వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందలేదు కాబట్టి.. దీనికి అనుంబంధంగా ఇంటర్ లింక్‌గా ఉండే మరో రెండు బిల్లులు (డీలిమిటేషన్ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లు) ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
నెక్ట్స్ ఏంటి?
వాస్తవానికి 2023లో తెచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు మార్పులుచేస్తూ కొత్త రాజ్యాంగ సవరణ చేయాలనుకుంది ప్రభుత్వం. కానీ, ఈ సవరణకు ఆమోదం లభించలేదు. అయితే, 2023లో పాసైన బిల్లు యధావిధిగా ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు (543)లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఇవ్వాలని భావిస్తే మళ్లీ కొత్తగా సభ ముందుకు బిల్లు తీసుకురావొచ్చు. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లు 2023.. ఏప్రిల్ 16వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్టు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
