మహారాష్ట్ర బీజేపీకి షాక్ లు…కోర్ కమిటీ నుంచి తప్పుకున్న పంకజా ముండే

మహారాష్ట్ర బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికస్థానాలు గెల్చుకున్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పటు చేయలేకపోయిన బీజేపీకి ఆ పార్టీ ముఖ్య నాయకులు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దివంగత బీజేపీ నాయకుడు గోపీనాద్ ముండే కుమార్తె అయిన పంకజా ముండే బీజేపీ వైఖరిపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
తన సొంత నియోజ కవర్గంలో తన సోదరుడు,ఎన్సీపీ ఎమ్మెల్యే ధనంజయ్ ముండే చేతిలో ఓటమే పంకజా ముండే అసంతృప్తికి కారణం. గురువారం(డిసెంబర్-12,2019)తన సొంత నియోజకవర్గం బీడ్ లో ఓ ర్యాలీలో పంకజా ముండే మాట్లాడుతూ… తాను ఇకపై మహారాష్ట్ర బీజేపీ కోర్ కమిటీలో కొనసాగబోను. ముఖ్యమైన పదవి కోసం నా పార్టీపై నేను ఒత్తిడి పెంచుతున్నానని ప్రజలు అంటున్నారు. కానీ ద్రోహం నా రక్తంలో లేదు.
ఇది నా పార్టీ, నాన్న పార్టీ. నేను దానిని వదలను. పార్టీ కోరుకుంటే నన్ను వదిలివేయవచ్చు అని ఆమె అన్నారు. బీడ్ లో ఎన్నికల ప్రచార సమయంలో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నుంచి తగినంత రాజకీయ సహకారం అందలేదని,రాష్ట్ర బీజేపీ వైఖరి పట్ల తాను అసంతృప్తితో ఉన్నానని ఆమె తెలిపారు.
మరోవైపు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయిన తర్వాత రాజకీయంగా పక్కకు తప్పుకున్న మరో బీజేపీ సీనియర్ నాయకుడు ఏక్ నాథ్ ఖడ్సే కూడా బీజేపీ వైఖరిపై అసంతృప్తితో ఉన్నట్లు తెలిపారు. ఖడ్సే ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే,ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ని కూడా కలిశారు. త్వరలోనే ఆయన బీజేపీ ఝలక్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.