రాజ్యసభలో మోడీ ప్రసంగం…రికార్డుల నుంచి తొలగించిన చైర్మన్

రాజ్యసభలో గురువారం(ఫిబ్రవరి-6,2020)ప్రధానమంత్రి నరేంద్రమోడీ విపక్షాలపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని గురువారం చర్చలో పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో ఎన్ పీఆర్ విషయంలో కాంగ్రెస్ పై మోడీ తీవ్రస్థాయిలో ఫైర్ అయిన విషయం తెలిసిందే.
అయితే ప్రధానమంత్రి చేసిన ప్రసంగంలోని కొంత భాగం రికార్డుల నుంచి తొలగించిన అరుదైన విషయం రాజ్యసభలో చోటుచేసుకుంది. ఎన్ పీఆర్ ను గట్టిగా సమర్ధిస్తూ మోడీ మాట్లాడిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు.
రాజ్యసభలో ఫిబ్రవరి 6 సాయంత్రం 6.20- 6.30 గంటల మధ్య చేసిన ప్రసంగంలోని కొంత భాగాన్ని తొలగించాల్సిందిగా చైర్మన్ ఆదేశించినట్లు రాజ్యసభ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో తెలిపింది. రాజ్యసభ చైర్మన్‌గా వెంకయ్యనాయుడు సభాకార్యక్రమాలను ఏ రోజుకు ఆరోజు పరిశీలించి సభ హుందాతనానికి తగని వ్యాఖ్యలు కనిపిస్తే వాటిని తొలగిస్తుంటారు. గతంలో చాలాసార్లు ఇలా జరిగినప్పటికీ మోడీ వ్యాఖ్యలు తొలగించడం మాత్రం అరుదనే చెప్పాలి.
మోడీ గురువారం రాజ్యసభలో… విపక్ష కాంగ్రెస్ NPRపై యూ టర్న్ తీసుకుందని, 2010లో NPR తీసుకువచ్చిన ఆ పార్టీ ఆ తర్వాత 2015లో అప్‌డేట్ చేసిందని, కొన్ని ఫోటోలు, బయోమెట్రిక్ సమాచారం చేర్చిందని మోడీ అన్నారు. అయితే మోడీ ప్రసంగం ముగిసిన తర్వాత కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ చేసిన ప్రసంగంలోని కొన్ని పదాలను కూడా రికార్డుల నుంచి రాజ్యసభ చైర్మన్ తొలగించారు.