లాక్‌డౌన్ 5: ఇంటి నుంచే పని.. మార్గదర్శకాలు ఇవే

కరోనావైరస్ మహమ్మారి కారణంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను జూన్ 30 వరకు కేంద్రం శనివారం(30 మే 2020) పొడిగించింది. అయితే జూన్ 8 నుంచి కంటైన్‌మెంట్ జోన్‌లు కాని ప్రదేశాల్లో మాల్స్, రెస్టారెంట్లు మరియు మతపరమైన ప్రదేశాలను అనుమతించడంతో పాటు అనేక నియంత్రణలను ప్రకటించింది.
అయితే సినిమా హాళ్లు, పాఠశాలలు మరియు అంతర్జాతీయ విమానాలు తిరిగి తెరిచే అవకాశం మాత్రం ఇప్పట్లో లేదు. లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన ఆర్థిక కార్యకలాపాలపై దృష్టి సారించిన హోం మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను తీసుకుని వచ్చింది. వస్తువుల మరియు ప్రజల కదలికలపై ఎటువంటి పరిమితి ఉండదని కూడా స్పష్టం చేసింది. ఏదైనా రాష్ట్రం రాకపోకలను నియంత్రించాలనుకుంటే, ఆ రాష్ట్రం తన నిర్ణయాన్ని ముందుగానే తెలపాలని స్పష్టం చేసింది.
కరోనావైరస్ లాక్‌డౌన్-5 పై మార్గదర్శకాలు:
మాస్క్‌లు: బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి; ఆఫీసుల్లో; రవాణా సమయంలో కచ్చితంగా మాస్క్ ఉండాలి.
బౌతిక దూరం: వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో 6 అడుగుల దూరం ఉండాలి. షాపులు కస్టమర్లలో శారీరక దూరాన్ని నిర్ధారిస్తాయి. ఒకేసారి ఐదుగురు వ్యక్తులను అనుమతించకూడదు.
సమావేశాలు: పెద్ద బహిరంగ సభలు / సమ్మేళనాలు నిషేధం. మత సంబంధ మీటింగ్‌లకు కానీ, మరేదైనా మీటింగ్‌లకు అవకాశం లేదు.
వివాహ సంబంధిత మార్గదర్శకాలు: అతిథుల సంఖ్య 50 మించకూడదు. అంత్యక్రియలు / చివరి కర్మలు సంబంధిత కార్యక్రమాల్లో కూడా 50మంది కంటే ఎక్కువ ఉండరాదు.
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నేరం.. జరిమానాతో పాటు శిక్ష. రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల అధికారం సూచించినట్లుగా దాని చట్టాలు, నియమాలు ఉంటాయి.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం, పాన్, గుట్కా, పొగాకు వినియోగం నిషేధం.
వర్క్ ఫ్రమ్ హోమ్: సాధ్యమైనంతవరకు, వర్క్ ఫ్రమ్ హోమ్.. ఆఫీసుల్లో పని చెయ్యక తప్పని పరిస్థితుల్లో సామాజిక దూరం పాటిస్తూ.. పనిగంటలు ఎప్పటికప్పుడు మార్చుకోవాలి.
స్క్రీనింగ్ మరియు పరిశుభ్రత: అన్ని ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్లు మరియు సాధారణ ప్రాంతాలలో థర్మల్ స్కానింగ్, హ్యాండ్ వాష్ మరియు శాంటిటైజర్ సదుపాయం ఉండాలి.
సామాజిక దూరం: పని ప్రదేశాలకు బాధ్యత వహించే వ్యక్తులందరూ కార్మికుల మధ్య తగినంత దూరం, షిఫ్ట్‌ల మధ్య తగినంత టైమ్, సిబ్బంది భోజన విరామాల్లో గ్యాప్ ఇవ్వడం లాంటివి చెయ్యాలి.