వైసీపీ రేసుగుర్రాలు: లోక్‌స‌భ అభ్య‌ర్థులు ఖరారు? 

  • Published By: vamsi ,Published On : March 10, 2019 / 04:32 AM IST
వైసీపీ రేసుగుర్రాలు: లోక్‌స‌భ అభ్య‌ర్థులు ఖరారు? 

భారీగా చేరిక‌లు, వలస నేతల హడావుడితో ఎన్నికల ముందు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ గడువు స‌మీపిస్తుండటంతో నేతలు పార్టీలు మారుతుండగా.. నాయకులు సీట్లను డిసైడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం నుంచి దాస‌రి జైర‌మేష్‌, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, అవంతి శ్రీనివాస్ వంటి కీల‌క నేత‌లు కూడా వైసీపీ గూటికి చేరడంతో అందరినీ దృష్టిలో పెట్టుకుని అభ్య‌ర్థుల జాబితాను వైసీపీ రూపొందించినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో 25 లోక్ స‌భ స్థానాలు ఉండ‌గా.. సుమారు 21 నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను వైసీపీ ఖ‌రారు చేసిన‌ట్లుగా లోటస్‌పాండ్ వర్గాలు చెబుతున్నాయి.

ఊహించిన‌ట్లే విజ‌య‌వాడ లోక్‌స‌భ బ‌రిలో ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త, తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థ‌ాపకుల్లో ఒక‌రైన దాస‌రి జైర‌మేష్‌ను దింప‌బోతున్నారు. టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో దిగే అవ‌కాశం ఉన్న సిట్టింగ్ ఎంపీ కేశినేని నానిని ఢీ కొట్ట‌గ‌లిగే స‌మ‌ర్థ‌త జైర‌మేష్ కు మాత్ర‌మే ఉంద‌ని వైసీపీ భావిస్తుంది. అలాగే టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని గుంటూరు లేదా న‌ర‌స‌రావు పేటల్లో ఒక‌దానికి కేటాయించే అవకాశం ఉంది. 2009 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మోదుగుల టీడీపీ అభ్యర్థిగా న‌ర‌స‌రావు పేట లోక్ స‌భ స్థానం నుంచి ఎన్నిక‌య్యారు. ఒకవేళ గుంటూరు సీటునే కేటాయించాల్సి వ‌స్తే గుంటూరు లోక్ స‌భ ఇన్‌ఛార్జిగా ఉన్న లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లును న‌ర‌స‌రావు పేట అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తార‌ని చెబుతున్నారు.

ఇప్పటివరకు ఖరారైనట్లుగా చెబుతున్న లోక్‌సభ అభ్యర్ధులు
శ్రీకాకుళం – దువ్వాడ శ్రీనివాస్
విజయనగరం – బొత్స ఝాన్సీ
విశాఖ – ఎంవివి చౌదరి
అనకాపల్లి – వరద కల్యాణి
అరకు – గొట్టేటి మాధవి,
కాకినాడ – బలిజి అశోక్
రాజమండ్రి – మార్గాని భరత్
అమలాపురం- చింతా అనురాధ
నరసాపురం – రఘురామ కృష్ణంరాజు
ఏలూరు – కోటగిరి శ్రీధర్
విజయవాడ – దాసరి జై రమేష్
మచిలిపట్నం – బాల‌శౌరీ
గుంటూరు లేదా న‌ర‌స‌రావుపేట‌-మోదుగుల వేణుగోపాలరెడ్డి
నరసరావు పేట లేదా గుంటూరు- శ్రీ కృష్ణ దేవరాయలు
ఒంగోలు – వైవీ సుబ్బారెడ్డి
నెల్లూరు – మేకపాటి రాజమోహన్ రెడ్డి
రాజంపేట – మిథున్ రెడ్డి
కడప – అవినాష్ రెడ్డి
హిందూపూరం – గోరంట్ల మాధవ్
అనంతపురం – పిడి రంగయ్య
నంద్యాల – శిల్పా రవిచంద్ర.
బాపట్ల, తిరుపతి, చిత్తూరు, కర్నూలు స్థానాల‌పై ఇంకా క‌స‌ర‌త్తు కొన‌సాగుతోంది.

ఇక నెల్లూరు జిల్లాలో కీలకనేతగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక లక్ష్మీ కోసం వైసీపీ నాయ‌క‌త్వం సంప్ర‌దింపులు జరుపుతుంది. ఆమె పార్టీలో చేరితే బాప‌ట్ల లోక్‌స‌భ స్థానం ఆమెకు కేటాయిస్తార‌ని చెబుతున్నారు. ఈ ఉద్దేశంతోనే ఆ స్థానానికి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేద‌ని స‌మాచారం. ఇదివ‌ర‌కు ప‌న‌బాక ల‌క్ష్మీ బాప‌ట్ల నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా లోక్‌స‌భకు ఎన్నిక‌య్యారు. పార్టీలకు అతీతంగా ఆమెకు నియోజ‌క‌వ‌ర్గంపై గ‌ట్టిప‌ట్టు ఉంది.

దీనిని దృష్టిలో ఉంచుకుని.. వైసీపీ ప‌న‌బాక కోసం సంప్ర‌దింపులు చేప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. ఇక 2014 ఎన్నిక‌ల్లో తిరుప‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన వ‌ర‌ప్ర‌సాద్‌కు నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. గూడూరు నియోజకవర్గంలో వైసీపీకి గట్టి బలం ఉంది. ఈ నియోజకవర్గం తిరుపతి లోక్‌సభ పరిధిలోకే వస్తుంది. కాగా తిరుపతి, చిత్తూరు, కర్నూలు స్థానాల‌ కోసం కొత్త నాయకులను వైసీపీ వెతుకుతుంది.