ఓట్లను తొలగించలేదు.. డేటా చోరీ మా పరిధిలోకి రాదు

  • Published By: vamsi ,Published On : March 6, 2019 / 08:46 AM IST
ఓట్లను తొలగించలేదు.. డేటా చోరీ మా పరిధిలోకి రాదు

Updated On : March 6, 2019 / 8:46 AM IST

బోగస్ ఓట్ల గురించి అప్లికేషన్లు వచ్చాయి కానీ ఓట్లను తొలగించలేదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి(CEC) గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఓట్లను తొలగించేందుకు ఫిర్యాదులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ద్వివేది స్పష్టం చేశారు. అధికారులు తప్పు చేస్తే మాత్రం సస్పెండ్ చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామంటూ హెచ్చరించారు.

10టీవీ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడిన ద్వివేది.. వారం రోజుల క్రితం వరకు ఓట్ల తొలగింపు కోసం లక్షల్లో దరఖాస్తులు వచ్చిన మాట వాస్తమేనని, ఇప్పుడు అటువంటి దరఖాస్తులు రావట్లేదంటూ వెల్లడించారు. ప్రతి దరఖాస్తును పరిశీలించిన తర్వాతే తొలగింపు ఉంటుందని, జనవరి 11తర్వాత ఎటువంటి తొలగింపులు జరగలేదని స్పష్టం చేశారు.

ఓట్ల తొలగింపు గురించి వస్తున్న విషయాలను నమ్మొద్దు అంటూ చెప్పిన ఆయన.. ఓట్ల తొలగింపుకు వచ్చిన అప్లికేషన్‌లను పరిశీలిస్తామని, ఒకవేళ అవి తప్పు అని తెలిస్తే అప్లై చేసినవారిపై కేసులు పెడుతామంటూ చెప్పారు. ఓట్ల తొలగింపు చేయడం ఈజీ ప్రాసెస్ కాదని, మూడు లెవల్‌లలో అప్రూవల్ జరుగుతుందని, ఫైనల్‌గా సీఈఓ అప్రూవల్ వచ్చిన తర్వాతే ఓట్ల తొలగింపు జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

ఎన్నికల కోసం రాజకీయ నాయకులు మోసం చేస్తుంటే ఈసీ చూస్తూ ఊరుకోదని, కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఓట్ల తొలగింపుపై రాష్ట్ర వ్యాప్తంగా 100పైగా కేసులు నమోదు అయ్యాయని అన్నారు. తెలంగాణలో వెలుగు చూసిన డేటా చోరీ వ్యవహారం మా పరిధిలోకి రాదని, అక్కడ ఉన్న పోలీసులు, చట్టాలు వాటిపై నిర్ణయం తీసుకుంటాయంటూ ఆయన చెప్పుకొచ్చారు. డేటా చోరి సంగతి పోలీసులు, కోర్టులే తేల్చాలని, ఎడిట్ చేయలేని ఓటర్ల జాబితాను మాత్రమే ఈసీ విడుదల చేసిందని తెలిపారు.