అప్లయ్ చేసుకోండి : ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10వేలు

ఏపీ లో ఆటో, ట్యాక్సీ వాలాలకు మంచి రోజులు రానున్నాయి. సీఎం జగన్ తన పాదయాత్రలో భాగంగా …అధికారంలోకి రాగానే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10 వేలు సాయం అందించి ఆసరాగా నిలుస్తామని ఇచ్చిన హామీ ఈ నెలాఖరున నెరవేరనుంది. మేనిఫెస్టోలో చేర్చిన మేరకు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను ఆదుకునేందుకు ఏడాదికి రూ.400 కోట్ల సాయం అందించనున్నారు. ఈ సాయాన్ని సెప్టెంబర్ నాలుగో వారంలో నేరుగా లబ్దిదారులకు అందించేందుకు ప్రభుత్వం రవాణా శాఖకు మార్గదర్శకాల్ని జారీ చేసింది. సెప్టెంబరు 4న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సొంతంగా ఆటో, ట్యాక్సీ ఉండి.. వారే నడుపుకునే వారికి ఈ సాయం వర్తింపచేస్తారు. అర్హులైన వారిని గుర్తించేందుకు ఇప్పటికే రవాణా శాఖ కసరత్తు పూర్తి చేసింది. ఆటోల వరకు ఇబ్బంది లేకున్నప్పటికీ, సొంత ట్యాక్సీలు నడుపుతున్న వారిని గుర్తించాల్సి ఉంది.
సెప్టెంబర్ 10నుంచి (మంగళవారం) అర్హులైన వారి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించేందుకు రవాణా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆన్‌లైన్‌లో అందిన దరఖాస్తులన్నీ ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపిస్తారు. వచ్చిన దరఖాస్తులను గ్రామ, వార్డు వలంటీర్లు పంపగా వారు క్షేత్ర స్ధాయిలో స్వయంగా పరిశీలించి నివేదిక పంపుతారు. 2019 మార్చి నెలాఖరు వరకు రాష్ట్రంలో 6.63 లక్షల ఆటోలు, ట్యాక్సీలు ఉన్నట్లు అంచనా. ఇందులో సొంతంగా నడుపుకుంటున్న వారివి 3.97 లక్షలకు పైగా ఉన్నట్లు రవాణా శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల నాలుగో వారంలో స్క్రూటినీ చేసి గ్రామాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అనంతరం రూ.10 వేల నగదును బ్యాంకుల్లో వారి ఖాతాల్లో జమ చేస్తారు. అనంతరం అందుకు సంబంధించిన రశీదుల్ని లబ్ధిదారులకు గ్రామ/వార్డు వలంటీర్లు అందిస్తారు.
గత తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో ఆటోలపై జీవితకాల పన్ను విధించింది. మరోవైపు ఆటో, ట్యాక్సీలకు ఫిట్‌నెస్, బీమా,రోడ్ ట్యాక్స్‌లు, మరమ్మతులకు అయ్యే ఖర్చు ఏటా రూ.10 వేలకు పైగా ఉంటోంది. ఇది డ్రైవర్లుకు భారంగా మారింది. దీంతో జగన్ పాదయాత్ర చేస్తున్నసమయంలో ప్రతి జిల్లాలోనూ ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు జగన్ ను కలిసి చంద్రబాబు ప్రభుత్వం తమను ఎలా ఇబ్బంది పెడుతుందో వివరించారు. ఆటో డ్రైవర్ల సమస్యలను కళ్లారా చూసిన, విన్న జగన్.. తాము అధికారంలోకి రాగానే ఉపాధి కోసం ఆటో కొనుక్కుని జీవనం సాగిస్తున్న వారికి రూ.10 వేల సాయం అందిస్తామని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన పాదయాత్రలో ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.