ఏలూరు అభ్యర్థి ఎవరు? టీడీపీ-జనసేనలో పొత్తు టెన్షన్

టీడీపీ-జనసేన కూటమి ఈ దిశగా ఆలోచించకపోవడంతో చాలా నియోజకవర్గాల్లో ఇరు పార్టీల్లో లేనిపోని అపోహలకు దారితీస్తోంది.

Eluru Assembly Seat Confusion In TDP Janasena

Eluru Assembly Seat : టీడీపీ-జనసేన మధ్య పొత్తు వ్యవహారం టెన్షన్ గా మారుతోంది. ఒకవైపు అధికార పార్టీ కొత్త సమన్వయకర్తలతో జోరు చూపిస్తుంటే.. విపక్ష కూటమిలో ఎవరు పోటీ చేస్తారో తెలియని అయోమయ పరిస్థితి కనిపిస్తోంది. అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైనా.. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ పోటీ చేయాలన్న అంశంపై క్లారిటీ ఉంటే ఈ గందరగోళం తొలిగే అవకాశం ఉన్నా.. టీడీపీ-జనసేన కూటమి ఈ దిశగా ఆలోచించకపోవడంతో చాలా నియోజకవర్గాల్లో ఇరు పార్టీల్లో లేనిపోని అపోహలకు దారితీస్తోంది.

ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలన్న దానిపై అస్పష్టత..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి పోటీపై ఇరుపార్టీల్లో చాలా క్లారిటీ ఉంది. కానీ, ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలన్న దానిపై ఇంకా అస్పష్టత కొనసాగుతోంది. ఇరు పార్టీల అధినేతలు సీట్ల సర్దుబాటుపై వివిధ దశల్లో చర్చించినా.. కేడర్ కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో ఏ పార్టీకి ఏ నియోజకవర్గంలో ఛాన్స్ వస్తుందో తెలియక రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో ఇరు పార్టీల నేతల్లో అయోమయం నెలకొంది. ముఖ్యంగా జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఈ గందరగోళం ఎక్కువగా కనిపిస్తోంది.

Also Read : హాట్‌ సీటుగా మారిన విశాఖ పార్లమెంట్‌ స్థానం.. బరిలో ఉండేందుకు పోటీ పడుతున్న నేతలు

గత ఎన్నికల్లో జనసేనకు 16వేలు ఓట్లు..
గత ఎన్నికల్లో జనసేన గణనీయంగా ఓట్లు సాధించిన ఏలూరు వంటి నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఏలూరులో గత ఎన్నికల్లో జనసేనకు దాదాపు 16వేల ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్ల వల్లే అప్పటి టీడీపీ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు కూడా రెండు పార్టీల మధ్య ఈ సీటు కోసం తీవ్ర పోటీ ఉండటంతో కేడర్ అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు.

టికెట్ రేసులో బడేటి చంటి, రెడ్డి అప్పలనాయుడు..
ఏలూరులో ప్రస్తుతం టీడీపీ ఇంఛార్జిగా బడేటి చంటి వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలనే ఉద్దేశంతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు చంటి. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న చంటికి.. లైన్ క్లియర్ అనుకుంటూ ఉండగా.. జనసేనతో పొత్తుతో పరిస్థితి తలకిందులైంది. ఈ నియోజకవర్గం నుంచి జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు కూడా టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెడ్డి అప్పలనాయుడు ఈసారి పోటీకి సై అంటుండటంతో రెండు పార్టీల మధ్య పీట ముడి పడింది.

Also Read : బీజేపీలో ఉంటూ టీడీపీ టికెట్ కోసం పోటీ? ధర్మవరం తెలుగుదేశం పార్టీలో తీవ్ర గందరగోళం

ఏలూరు టీడీపీలో పెరుగుతున్న టెన్షన్..
ఎంపీటీసీగా వెంకటాపురం మేజర్ పంచాయితీ సర్పంచ్ గా పని చేసిన అనుభవంతో పాటు గతంలో టీడీపీలో పని చేసినప్పటి పరిచయాలు తనకు లాభిస్తాయని అప్పలనాయుడు చెబుతున్నారు. కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న ఏలూరును జనసేనకే కేటాయించాలని వాదిస్తున్నారు అప్పలనాయుడు. ఇదే సమయంలో టీడీపీ నుంచి మరికొన్ని కొత్త పేర్లు తెరపైకి వస్తుండటంతో ఏలూరు టీడీపీలో టెన్షన్ ఎక్కువ అవుతోంది. అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోవాల్సిన సమయంలో ఎలా ముందుకెళ్లాలో దిక్కుతోచని స్థితిలో పార్టీ నేతలు కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి ఏర్పడటంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.