AP Bjp Tickets Issue : రంగంలోకి బీజేపీ పెద్దలు.. టికెట్లు రాని నేతలకు బుజ్జగింపులు

ఏపీ బీజేపీ ఆఫీసులో సత్యకుమార్, విష్ణువర్దన్ రెడ్డితో ఆయన సమావేశం అయ్యారు.

AP Bjp Tickets Issue : రంగంలోకి బీజేపీ పెద్దలు.. టికెట్లు రాని నేతలకు బుజ్జగింపులు

AP Bjp Tickets Issue

AP Bjp Tickets Issue : ఏపీ బీజేపీలో అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో పడింది అధిష్టానం. పొత్తుల్లో భాగంగా ఎంపీ సీట్లు రాని సీనియర్లు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. దీంతో వీరిని బుజ్జగించేందుకు ఏపీ ఎన్నికల ఇంఛార్జ్ అరుణ్ సింగ్ రంగంలోకి దిగారు. ఏపీ బీజేపీ ఆఫీసులో సత్యకుమార్, విష్ణువర్దన్ రెడ్డితో ఆయన సమావేశం అయ్యారు.

బీజేపీని గెలిపించడమే మా లక్ష్యం- విష్ణువర్దన్ రెడ్డి
టికెట్లు దక్కని నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు అన్న అంశంపై బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి స్పందించారు. పార్టీలో అసంతృప్తులు లేవని విష్ణువర్దన్ రెడ్డి తేల్చి చెప్పారు. అంతేకాదు ఎన్నికల సమయంలో నేతలు టికెట్లు అడగటం అత్యంత సహజం అని అన్నారాయన. సీట్లు ఎవరికి ఇవ్వాలి అనేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. ఏపీలో బీజేపీని గెలిపించడమే తమ లక్ష్యం, బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

ఏపీలో బీజేపీ బలపడాలి- విష్ణువర్దన్ రెడ్డి
”పార్టీలో అసంతృప్తులు లేవు. పార్టీలో అందరం కలిసి పని చేస్తాం. ఏపీలో బీజేపీ బలపడాలి. ఏపీ బీజేపీ జెండా ఎగరేయాలి. పార్టీలో సీట్లు అడగటం అనేది సహజం. ఎన్నికల సమయంలో ప్రతి కార్యకర్త టికెట్లు ఆశిస్తారు. అయితే సీట్లు ఎవరికి ఇవ్వాలి? అనేది నాయకత్వం నిర్ణయిస్తుంది. పార్టీలో సీట్లు వస్తేనే అని కాదు.. సీట్లు వచ్చిన కార్యకర్తలను గెలిపించడం కూడా మా బాధ్యత. మాలో అసంతృప్తి ఉంటే పార్టీ ఆఫీసుకి ఎందుకు వస్తాం? బీజేపీలో అసంతృప్తులు ఏమీ లేవు. బీజేపీలో సమష్టి నాయకత్వం ఉంటుంది. ఏపీలో బీజేపీ గెలవాలన్నది అందరి ఆకాంక్ష. నాకు తెలిసి టికెట్ల వ్యవహారంపై ఏ సీనియర్ నేత విమర్శ చేయలేదు” అని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.

మా భవిష్యత్తు పార్టీ నిర్ణయిస్తుంది- సత్యకుమార్
టికెట్ల వ్యవహారంపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సైతం స్పందించారు. పార్టీలో అక్కడక్కడ అసంతృప్తులు ఉన్నా.. సర్దుకుంటాయని ఆయన అన్నారు. పార్టీ నిర్ణయమే తమకు శిరోధార్యం అని తేల్చి చెప్పారు. నా పోటీ జాతీయ స్థాయిలోనా? రాష్ట్ర స్థాయిలోనా? అనేది హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. ” ఎప్పుడైనా ఏ ఎన్నికల్లో అయినా ఎవరికైనా సీటు వచ్చినప్పుడు సీట్లు రాని వారు బాధపడటం సహజం. బీజేపీలో ప్రతి కార్యకర్త సిద్ధాంతం కోసం పని చేసే వారే. కార్యకర్తల్లో అక్కడక్కడ బాధ ఉంటుంది. చాలా ఏళ్ల నుంచి పని చేస్తున్న వారికి, కోరుకున్న వారికి టికెట్ రానప్పుడు బాధ ఉంటుంది.

కానీ, అవన్నీ ఒకటి రెండు రోజులు మాత్రమే. ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి. అందరూ పనిలోకి దిగుతారు. పార్టీతో మాట్లాడటం జరిగింది. మా భవిష్యత్తు ఏంటనేది పార్టీ నిర్ణయిస్తుంది. నేను కేంద్ర స్థాయిలో పని చేయాలా? రాష్ట్ర స్థాయిలో పని చేయాలా? అన్నది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అందుకు అనుగుణంగా పని చేస్తాం” అని సత్యకుమార్ చెప్పారు.

పార్టీ అంతర్గత విషయాలపై చర్చించుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. చాలామంది సీట్లు ఆశించారని చెప్పారు. కానీ, పొత్తుల్లో భాగంగా కొంతమంది సీట్లను త్యాగం చేయాల్సి వచ్చిందన్నారు. ”పొత్తుల్లో మాకు వచ్చిన సీట్లు ఎన్నో అందరికీ తెలిసిందే, అందుకు పరిమితమై మేము పని చేసుకోవాలి. క్రమశిక్షణ కలిగిన ప్రతి బీజేపీ కార్యకర్త.. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారు. అంకితభావంతో పని చేస్తారు” అని పురంధేశ్వరి తెలిపారు.

Also Read : టీడీపీలో ఆ 10 మంది బడా నేతల భవిష్యత్తు ఏంటి? టికెట్ దక్కకపోవడానికి కారణాలేంటి?