Tdp Bjp Janasena Seats Sharing : చంద్రబాబుతో ముగిసిన షెకావత్, జయంత్ పండా భేటీ.. 8గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు

సీట్ల సర్దుబాటు, రాజకీయ వ్యూహం, 17న తొలి బహిరంగ సభ నిర్వహణ పై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.

Tdp Bjp Janasena Seats Sharing : టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన నివాసంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ నేత బైజయంత్ పండాల భేటీ ముగిసింది. 8గంటల పాటు సుదీర్ఘంగా చంద్రబాబుతో వారు చర్చలు జరిపారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. సీట్ల సర్దుబాటు, రాజకీయ వ్యూహం, 17న తొలి బహిరంగ సభ నిర్వహణ పై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ ఏ విధంగా లబ్దిపొందే ప్రయత్నం చేస్తుందనే అంశంపైనా నేతల మధ్య కీలక చర్చ జరిగినట్లు సమాచారం.

పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలను అడ్డం పెట్టుకుంటున్న తీరు, సచివాలయ వ్యవస్థను దుర్వినియోగం అంశాలపైనా చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ పాల్గొనే మూడు పార్టీల తొలి బహిరంగ సభ ఈ నెల 17నే నిర్వహించాలని ఈ భేటీలో నేతలు నిర్ణయించారు. చిలకలూరిపేట బొప్పూడి వద్ద నిర్వహించే సభ తేదీని ఖరారు చేశారు. లోకేశ్ నేతృత్వంలో సభ నిర్వహణ ఏర్పాట్లు సాగనున్నాయి.

ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపై తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో చంద్రబాబు, గజేంద్ర సింగ్ షెకావత్, పవన్ కళ్యాణ్, జయంత్ పాండా, నారా లోకేశ్ పాల్గొన్నారు. పొత్తులో భాగంగా 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ, జనసేన పోటీ చేయనున్నాయి. ఇప్పటికే తాము పోటీ చేసే 7 అసెంబ్లీ స్థానాలను జనసేన ప్రకటించింది. నెల్లిమర్ల, అనకాపల్లి, కాకినాడ రూరల్, రాజానగరం, రాజోలు, నిడదవోలు, తెనాలి స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. మిగిలిన 23స్థానాల్లో జనసేన, బీజేపీలు ఎవరెక్కడ పోటీ చేస్తారనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది.

Also Read : ఈ రెండు స్థానాల్లో పోటీ చేయనున్న పవన్ కల్యాణ్?

ట్రెండింగ్ వార్తలు