బొత్స లీకులు ఇస్తున్నారా? భవిష్యత్తు చెప్తున్నారా?
బొత్స మాటలు భవిష్యవాణి అనుకోవచ్చా. ఈనాడు అన్నది ఏదో ఒకనాడు నిజమై తీరుతోంది కాబట్టి.. కావాలనే హింట్ ఇస్తున్నారని అనుకోవాలా.

బొత్స మాటలు భవిష్యవాణి అనుకోవచ్చా. ఈనాడు అన్నది ఏదో ఒకనాడు నిజమై తీరుతోంది కాబట్టి.. కావాలనే హింట్ ఇస్తున్నారని అనుకోవాలా.
బొత్స మాటలు భవిష్యవాణి అనుకోవచ్చా. ఈనాడు అన్నది ఏదో ఒకనాడు నిజమై తీరుతోంది కాబట్టి.. కావాలనే హింట్ ఇస్తున్నారని అనుకోవాలా. ముందు ఆయనే మాట్లాడి.. వక్రీకరించారని ఆయనే అని.. తిరిగి అవే మాటలు నిజమైతే ఏమనాలి. ఈ ప్రశ్నలేమో గాని.. ఎన్డీయేతో కలుస్తాం అన్న మాట బూమరాంగ్ అయి అదే నిజమవుతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
బొత్స మాటలను కాస్త జాగ్రత్తగా గమనిస్తే చాలు… ఆయన చెప్పే మాటల్లో ఇంకేమైనా అర్థం ఉందేమో తెలుసుకోగలిగితే చాలు.. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు ముందే పసిగట్టొచ్చు. ఆయన అలా లీకులు ఇస్తున్నారని అనలేం గాని, ఓ మంత్రిగా ప్రభుత్వ వ్యవహారాలు, ఆలోచనలపై కచ్చితంగా అవగాహన ఉంటుంది. అందుకే, ఆయన మున్ముందు ఏం జరగబోతుందన్న దానిపై చిన్న హింట్ ఇచ్చి వదిలేస్తారు. ఆయన చెప్పిన సమయానికి ఆ అంశాన్ని ఒక్కోసారి సీరియస్‌గా తీసుకోని రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే, ఆయన అన్న మాటలనే ఆయనే ఖండిస్తారు కాబట్టి. చివరాఖరుకి జరిగేది ఏంటయా అంటే.. ఆయన నోటి నుంచి మొట్టమొదటగా వచ్చిన వాక్యమే నిజమై తీరుతుంది. కావాలంటే రెండు మూడు ఉదాహరణలను తీసుకోవచ్చు.
ముందుగా చెప్పాల్సింది.. ఇప్పుడు ఏపీలో అట్టుడుకుతున్నది రాజధాని అంశమే. రాజధాని మార్పునకు సంబంధించిన తొలి హింట్ ఇచ్చింది కచ్చితంగా మంత్రి బొత్స సత్యనారాయణే. డైరెక్టుగా రాజధాని తరలింపు అని చెప్పకపోయినా.. అమరావతిలో ఏముందని అంటూ కామెంట్ చేశారు. ఆనాడు అప్పుడు చేసిన కామెంట్.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు నాంది. అమరావతిలో శ్మశానం తప్ప ఏముందని కామెంట్ చేసినప్పుడే.. రాజధానిని ఇక్కడ ఉంచే ఉద్దేశం లేదని అర్ధమైపోయింది.
ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఫస్ట్ టైమ్ అమరావతి గురించి ప్రభుత్వం నుంచి వచ్చిన కామెంట్ అది. అందులోనూ బొత్స ఉన్నది మంత్రిస్థాయిలో. సో, అమరావతిలో అలజడి మొదలైంది. తరువాత, నా వ్యాఖ్యలను వక్రీకరించారంటూ ఆయనే మీడియా ముందుకు వచ్చారు. ఆ తరువాత మళ్లీ కట్టుబడి ఉన్నానంటూ కామెంట్ చేశారు. ఇలా కొన్ని మలుపులు తిరిగిన స్టోరీ.. చివరకు ఆయన అన్న మాట దగ్గరికే వచ్చింది.
సరే, రాజధానిగా అమరావతిని కొనసాగించడం ప్రభుత్వానికి ఇష్టం లేదన్న విషయం బొత్స నోటి నుంచి వచ్చింది. మరి రాజధాని ఎక్కడ ఉంటుంది, ఎక్కడకి తరలిస్తారు, ఎక్కడ కొత్త బిల్డింగుల కడతారు. ఇలా ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. అప్పుడు కూడా ఓ హింట్‌ని అలా వదిలింది బొత్సనే. పరిపాలన విశాఖ నుంచే జరుగుతుంది అన్నారు. అన్నట్టుగానే, ఎన్ని అడ్డంకులు వచ్చినా.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రెడీ అయిపోతోంది.
అవసరమైతే ఎన్డీయేలో కలుస్తాం. డైరెక్టుగా ఈ మాట అనకపోయినా.. ఏపీ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తాం… ఎంతమంది గడ్డాలైనా పట్టుకుని బతిమిలాడతాం అంటూ కామెంట్ చేశారు మంత్రి బొత్స. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏమైనా చేస్తాం అన్న బొత్స ఈ వ్యాఖ్యలే రాజకీయ దుమారాన్ని లేపాయి. జగన్ ఢిల్లీ టూర్‌లో ప్రధానిని, అమిత్‌షాను, కేంద్ర పెద్దలను కలిసి తరువాత.. వెంటనే బొత్స నుంచి ఈ కామెంట్ రావడంతో.. సహజంగానే ఎన్డీయేతో కలుస్తాం అన్న మాటకు వెయిట్ ఉంటుంది. ఆ తరువాత తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఖండించినా.. అమరావతి విషయంలోనూ ఇదే కదా జరిగింది అన్న మాట వినిపిస్తోంది. గతంలో ఇలా హింట్ ఇచ్చినవే.. నిజం అయ్యాయి.
రేపు ఈ మాట నిజం కాదన్న గ్యారెంటీ ఏంటన్న ప్రశ్న వినిపిస్తోంది. పైగా బొత్స మాటల్లోంచి పుట్టుకొచ్చిన ఆంతర్యం విలువ అంతాఇంతా కాదు. చాలా కాస్ట్లీ. అందుకే, అటు పవన్ నుంచి బీజేపీ నాయకుల వరకు రియాక్ట్ అయ్యారు. అయినా, వేడి చల్లారకపోయే సరికి బొత్స సహా వైసీపీ నేతలే రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరి బొత్స మాటలు భవిష్యవాణి అనుకోవాలా, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోడానికి వదులుతున్న హింట్స్ అనుకోవాలా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.