ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. మంగళవారం సభలో రాజధాని అంశంపై చర్చ జరిగింది. చర్చలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు శివరామకృష్ణ కమిటీ …రాజధాని అంశాలపై మాట్లాడారు. ఇప్పటి వరకు ఏపీకి సరైన రాజధాని లేకుండా పోయిందని, ఉమ్మడిరాష్ఠ్రంలో అన్ని ప్రాంతాలు అభివృధ్ధి చేసి ఉంటే ఈ పరిస్ధితి వచ్చి ఉండేది కాదని అన్నారు.
టీడీపీ ప్రభుత్వం వేలకు వేల ఎకరాలు తీసుకుని పేదల నోళ్లలో మట్టి కొట్టిందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ కోసమే ప్లాన్ నడుస్తోందని నేను గతంలోనే చెప్పానని ధర్మాన గుర్తు చేసారు. గ్రాఫిక్స్ తో మోసం చేశారని…. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను గాలికి వదిలేశారని ఆయన గత ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో వెనుక బడిన ప్రాంతాలు అభివృధ్ది చేందాలని లేకపోతే తెలంగాణ ఉద్యమంలాంటి ఉద్యమం ఆంధ్రాలోనూ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.
70 ఏళ్లుగా అభివృధ్ది అంతా హైదరాబాద్ చుట్టే జరిగిందని ఏపీలో కూడా టీడీపీ హాయంలో అలాంటి కుట్రే జరిగిందని ఆక్షేపించారు. రాజధానిపై చర్చలో మాట్లాడుతూ ధర్మాన 1969లోనూ..2009లో వచ్చిన తెలంగాణ ఉద్యమం గురించి పోలిక చెప్పారు. 2009 లో జరిగిన తెలంగాణ ఉద్యమానికి స్వార్ధం కారణమని వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రజలు అక్కడి నుంచి వెళ్లి పోతే ….అప్పటి వరకు జరిగిన అభివృధ్ది ఫలాలు అన్నీ తమకే దక్కుతాయని తెలంగాణ ప్రజలు ఆశించారని అన్నారు. ఈ కారణంగానే పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగమయ్యారని…ఉద్యమాన్ని కంట్రోల్ చేసే నాయకుడు లేకుండా పోయాడని వ్యాఖ్యానించారు.